ఆదోని మున్సిపల్ పీఠం జనసేనదే: ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ హామీ
మల్లప్పన్నకే చైర్మన్ పదవి దక్కేలా చూస్తామని స్పష్టీకరణ
పార్టీ శ్రేణుల్లో వెల్లివిరిసిన నూతన ఉత్సాహం
ఆదోని, (ప్రతినిధి): ఆదోని మున్సిపల్ చైర్మన్ పీఠం నూటికి నూరు శాతం జనసేన పార్టీకే దక్కుతుందని, పార్టీ ఆదోని ఇన్ఛార్జ్ మల్లప్పన్నకే ఆ పదవి దక్కేలా పూర్తిస్థాయిలో చొరవ చూపుతామని పార్టీ రాష్ట్ర స్థానిక సంస్థల సమన్వయకర్త, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొల్లిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ఇటీవల ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్య నేతలు బొల్లిశెట్టి శ్రీనివాస్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక రాజకీయ పరిణామాలు, మున్సిపల్ పాలకమండలికి సంబంధించి ఆదోని చైర్మన్ సీటు కేటాయింపు అంశంపై నేతలు ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తూ, ప్రజలకు అండగా నిలుస్తున్న మల్లప్పన్నకు చైర్మన్ పదవి కేటాయించాలని నేతలు గట్టిగా విజ్ఞప్తి చేశారు. దీనిపై బొల్లిశెట్టి శ్రీనివాస్ అత్యంత సానుకూలంగా స్పందిస్తూ… ఆదోని మున్సిపల్ పీఠం జనసేన కైవసం చేసుకోవడం ఖాయమని, ఈ విషయంలో మల్లప్పన్నకే ప్రాధాన్యత లభించేలా పార్టీ అధిష్ఠానం వద్ద చర్చిస్తామని భరోసా ఇచ్చారు. ఈ హామీతో ఆదోని జనసేన శ్రేణుల్లో, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వెల్లివిరిసింది. పార్టీ అధిష్ఠానం తీసుకున్న చొరవ పట్ల నేతలు హర్షం వ్యక్తం చేస్తూ, మల్లప్పన్న నాయకత్వంలో ఆదోనిలో జనసేన పార్టీకి సముచిత గౌరవం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదోని జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

