ఆదివాసుల రాజకీయ హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తోంది
డిఎల్ఓ జిల్లా ప్రధాన కార్యదర్శి కిల్లో మనోజ్ కుమార్ మండిపాటు
సీలేరు: ఐదవ షెడ్యూల్ పరిధిలోని సీలేరు గ్రామపంచాయతీ వైస్ ప్రెసిడెంట్ పదవిని స్థానిక ఆదివాసులకు కాకుండా గిరిజనేతరుడికి కేటాయించడం తీవ్ర అన్యాయమని దండకారణ్య విమోచన సమితి (డిఎల్ఓ) జిల్లా ప్రధాన కార్యదర్శి కిల్లో మనోజ్ కుమార్ విమర్శించారు. ఇది ఆదివాసుల రాజకీయ హక్కులను కాలరాయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసుల రాజ్యాంగబద్ధమైన హక్కులు, చట్టాలు, ఆత్మగౌరవం, స్వయంపాలనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఆదివాసుల హక్కులను కాపాడటంలో పూర్తిగా విఫలమైందని, వరుసగా వారిని రాజకీయ ప్రాతినిధ్యం నుంచి దూరం చేస్తోందని ఆరోపించారు.
ఇటీవల చింతపల్లి మండలంలో ఎంపీపీ వైస్ ప్రెసిడెంట్ పదవిని గిరిజనేతరులకు కేటాయించారని, తాజాగా సీలేరు పంచాయతీలోనూ అదే ధోరణిని కొనసాగించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటమి పార్టీల్లో ఉన్న ఆదివాసీ నాయకులు ఈ అన్యాయంపై ఆలోచించి, ఆ పార్టీల్లో కొనసాగే విషయంపై పునరాలోచన చేయాలని సూచించారు.
తక్షణమే ప్రభుత్వం స్పందించి సీలేరు వైస్ ప్రెసిడెంట్ పదవిని స్థానిక ఆదివాసులకు కేటాయించి న్యాయం చేయాలని మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టపరంగా పోరాటం చేపడతామని, తద్వారా ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.

