గూగుల్ డేటా భూములకు దళితుల భూములు మినహాయించాలి.

గూగుల్ డేటా భూములకు దళితుల భూములు మినహాయించాలి-సిపిఎం డిమాండ్



విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ దళితుల జీవనాధారమైన 115 ఎకరాల భూములను గూగుల్ డేటా సెంటర్ కోసం కేటాయింపుల నుండి మినహాయించాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి. కృష్ణారావు, భీమిలి జోన్ కార్యదర్శి ఆర్.ఎస్.ఎన్.మూర్తి డిమాండ్ చేసారు.



దళితుల భూములు గూగుల్ డేటా నుండి మినహాయించాలని సోమవారం జిల్లా కలెక్టర్ను బాధితులతో కలిసి వినతిపత్రాన్ని అందజేసారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1971 లో 53 మందికి 2 ఎకరాల చొప్పున ప్రభుత్వ బంజరు భూములు ఇచ్చిందన్నారు. రాళ్లు, రప్పలతో కూడిన భూములను, అప్పులు చేసి కష్టపడి సాగులోకి తెచ్చుకొని గత 53 సంవత్సరాలుగా జీవనాన్ని సాగిస్తున్నారన్నారు. మరో 260 ఎకరాలు దళితుల భూములను ప్రభుత్వం లాక్కోవడం సరైనదికాదన్నారు. మా జీవనాధారమైన భూములు డేటా సెంటర్ ఇవ్వబోమని దళితులు మొరపెట్టుకుంటున్నా ఎలాగైనా ఇవ్వాల్సిందే అని తెలపడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. గతంలో కూడా డంపింగ్ యార్డు, బ్యాటరీ కంపెనీలు ల్యాండ్ పూలింగ్ల పేరుతో భూములు లాక్కోవాలని ప్రయత్నం చేశాయని గుర్తుచేసారు. ఆనందపురం గత తహశీల్దార్ భూముల రీసర్వే పేరుతో ఎల్పి నెంబర్ల ఇస్తామని వీరితో పలకలపై భూముల వివరాలు వ్రాయించి పట్టించి ఫోటోలు తీసి, కొన్ని రోజుల తరువాత గూగుల్ డేటా సెంటర్కు మీభూములను ఇస్తున్నాము, మీకు రావాల్సిన పరిహారం తీసుకెళ్ళమని చెప్పిమోసం చేసిన శ్యామ్ ప్రసాద్ మాజీ తహశీల్దార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. భూ సేకరణ చట్టం పరిధిలో చర్యలు తీసుకుంటామని కాకుండా డేటా సెంటర్ కు భూములను మినహాయించాలని లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.