హైదరాబాద్: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కార్డు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణా రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ విధానం, అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ సిహెచ్. ప్రియాంక, సీఎం సీపీఆర్‌వో జి. మల్సూర్‌లతో కలిసి మంత్రి పొంగులేటి సుదీర్ఘంగా చర్చించారు.
జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అక్రిడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం ముందుగా జి.ఓ. 252 జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం జర్నలిస్టు సంఘాలతో సమావేశమై వారి సూచనలు, అభిప్రాయాలను సవివరంగా పరిగణనలోకి తీసుకొని అవసరమైన సవరణలు చేసి జి.ఓ. 103ను జారీ చేసినట్లు వెల్లడించారు.
ఈ సవరణల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా విభాగాల్లో మొత్తం 44,706 అక్రిడిటేషన్ కార్డులు పొందే అవకాశం కలుగుతుందన్నారు. గతంలో సుమారు 23 వేల మందికి మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు ఉండగా, తాజా నిర్ణయంతో దాదాపు 21 వేలకు పైగా కార్డుల సంఖ్య పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా 2.50 లక్షల పైగా సర్క్యులేషన్ ఉన్న 8 పత్రికలకు 6,256 కార్డులు, 75 వేల నుండి 2.50 లక్షల వరకు సర్క్యులేషన్ ఉన్న 24 పత్రికలకు 17,784 కార్డులు, 25001 నుంచి 75 వేల వరకు సర్క్యులేషన్ గల 30 పత్రికలకు 3,390 కార్డులు, 15,001 నుంచి 25,000 వరకు సర్క్యులేషన్ గల 169 చిన్న పత్రికలకు 11,661 లభిస్తాయన్నారు.
ఇక పదిహేను వేలలోపు సర్క్యులేషన్ గల 113 చిన్న పత్రికలకు 226, పీరియాడికల్స్‌కు 624, 20 న్యూస్ ఏజన్సీలకు 68 అక్రిడిటేషన్‌లు పొందుతాయని తెలిపారు. అలాగే 21 శాటిలైట్ ఛానళ్లకు 4,431 కార్డులు, 8 జాతీయ ఛానల్స్‌కు 32, వంద లోకల్ కేబుల్ ఛానళ్లకు 200, డిజిటల్ మీడియా విభాగానికి 10 కార్డులు మొత్తంగా 44,706 కార్డులు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో రాష్ట్ర, జిల్లా స్థాయిలో 16,056, నియోజకవర్గ, మండల స్థాయిలో 28,650 మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అవసరాన్ని బట్టి మరోసారి సమావేశమై తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
