డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మార్చి 26: ఎల్పిజి గ్యాస్ సరఫరా పై అపోహలు సృష్టిస్తే కఠిన చర్యలు గైకొనడం జరుగుతుందని జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులకు సూచించారు. గృహ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వాడ వద్దన్నారు. గ్యాస్ వినియోగంపై ఎవరైనా అనవసర ప్రచారాలు నిర్వహించి అపోహలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్యాస్ కొరత నేపథ్యంలో గృహ గ్యాస్ వినియోగానికి సంబంధించి కోనసీమ జిల్లాలో ఎలాంటి కొరత లేదన్నారు. అయితే గ్యాస్ కొరత ఏర్పడుతున్న ఉద్దేశంతో కొంతమంది అధిక బుకింగ్ చేసుకోవడం వల్ల సాంకేతిక సమస్య ఏర్పడుతోందని, గ్యాస్ సరఫరాలో ఎలాంటి లోపాలు లేవన్నారు. గ్యాస్ బుకింగ్, సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే కమాండ్ కంట్రోల్ నెంబర్. 94416 92275 లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. గృహ అవసరాలకు ఉపయోగిం చే గ్యాస్ సిలిండర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వాణిజ్య అవసరాలకు వినియోగించరాదన్నారు. అలా వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని హోటల్ రెస్టారెంట్ క్యాటరింగ్ యాజమాన్యాలను హెచ్చరించారు. ఏ విధంగా గ్యాస్ ఏజెన్సీల నిర్వహకులు గృహ అవసరాల సిలిండర్లను వాణిజ్య అవసరాలకు విక్రయిస్తే ఆయా ఏజెన్సీలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మండలాల్లోని తహసిల్దార్లు, సివిల్ సప్లై డిప్యూటీ తహసిల్దార్ ను ప్రతిరోజు గ్యాస్ ఏజెన్సీలో నిలువలను పరిశీలించి ఎప్పటికప్పుడు నివేదికలను పంపాలన్నారు. అదేవిధంగా హోటళ్లు, రెస్టారెంట్లు, తోపుడు బండ్ల పై నిర్వహించే హోటళ్లపై తనిఖీలు నిర్వహించి గృహ అవసర సిలిండర్లను వినియోగిస్తున్నట్లయితే నిత్యావసరాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని డీఎస్ఓ ఆదేశించారు. ఎల్పీజీ పేరుతో అదనపు చార్జీలు వసూలు చేయరాదని హోటళ్లు, రెస్టారెంట్లకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఎల్పీజీ పేరుతో అదనపు చార్జీలు వసూలు చేయకూడదని స్పష్టం చేసిందన్నారు. గ్యాస్ కొరతను చూపిస్తూ అదనపు సేవల ఛార్జీ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) హెచ్చరించిందన్నారు. ఎల్పీజీ గ్యాస్ కొరత పేరుతో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో సీసీపీఏ స్పందించిందన్నారు. ఎల్పీజీ గ్యాస్ పేరుతో కొన్నిహోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారుల నుంచి అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపిందన్నారు.

