కోసిగి, ఆగస్టు 25 (న్యూస్): శ్రావణమాసం రెండవ సోమవారం సందర్భంగా కోసిగి మండలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వివిధ దేవాలయాలకు వాహనాల్లో తరలివచ్చారు. దీంతో కోసిగి మండల కేంద్రంలో తెల్లవారుజాము నుంచే తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఈ ట్రాఫిక్ కారణంగా అత్యవసర సేవలకు అంతరాయం కలిగింది. అత్యవసర రోగిని తీసుకెళ్తున్న 108 అంబులెన్స్‌కు దాదాపు అరగంటపాటు దారి లభించకపోవడం ఆందోళనకు గురిచేసింది. అంబులెన్స్ సైరన్ మోగించినప్పటికీ కొంతమంది వాహనదారులు మార్గం ఇవ్వకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి నిమిషం విలువైన అత్యవసర సేవలకు ట్రాఫిక్ అడ్డంకిగా మారడం బాధాకరమని స్థానికులు పేర్కొన్నారు. శ్రావణమాసంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ట్రాఫిక్ ప్రణాళిక అమలు చేసి, ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించి రాకపోకలు సాఫీగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసు శాఖను కోరుతున్నారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ట్రాఫిక్ నియంత్రణను మరింత పకడ్బందీగా నిర్వహించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.

