నాగర్‌కర్నూలు, బల్మూరు: నాగర్‌కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పాఠశాల తనిఖీ సందర్భంగా కాసేపు సోషల్ టీచర్‌గా మారి విద్యార్థులకు సాంఘిక శాస్త్రం పాఠాలు బోధించారు. అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూరు మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన విద్యార్థులతో ఆప్యాయంగా మమేకమయ్యారు.
ఈ సందర్భంగా 8వ తరగతి గదిలోకి వెళ్లిన కలెక్టర్ విద్యార్థులను సాంఘిక శాస్త్రానికి సంబంధించిన అంశాలపై ప్రశ్నించారు. అనంతరం స్వయంగా బ్లాక్‌బోర్డుపై అక్షాంశాలు, రేఖాంశాలు, భూమధ్యరేఖ వంటి భౌగోళిక అంశాలను చిత్రాలతో వివరిస్తూ పాఠం బోధించారు. కలెక్టర్ స్వయంగా తరగతి నిర్వహించడంతో విద్యార్థులు ఆసక్తిగా పాఠాలను ఆలకించారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడిన కలెక్టర్, పాఠశాలలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిని వ్యక్తిగతంగా పరిశీలిస్తూ అవసరమైన మార్గదర్శకత్వం, సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. విద్యార్థుల్లో పాఠశాల పట్ల ఆసక్తి, చదువుపట్ల శ్రద్ధ పెంపొందించేలా అనుకూల వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

