ఆదోని, ఆగస్టు 19 (ప్రతినిధి): ఆదోని డివిజన్ పరిధిలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించి, విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (డీఎస్‌ఎఫ్) డిమాండ్ చేసింది. బుధవారం ఆదోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అడ్మిషన్ బ్లాక్ సమీపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్‌ఎఫ్ ఆదోని డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ హర్ష ఈ మేరకు మాట్లాడారు.
ప్రభుత్వ హాస్టళ్లకు సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల విద్యార్థులకు సరైన వసతి, భోజనం, తాగునీటి సౌకర్యాలు అందడం లేదని, కొన్ని హాస్టళ్లలో మౌలిక వసతుల కొరత కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదోని డివిజన్‌లోని అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, విద్యార్థులకు నాణ్యమైన వసతి, పరిశుభ్రమైన భోజనం, సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు మరియు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని డీఎస్‌ఎఫ్ తరఫున డిమాండ్ చేశారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కొనసాగిస్తే డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రవి కిరణ్, సుకుమార్, అరవింద్, మారుతి తదితర డీఎస్‌ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.


