ప్రైవేటు విద్యాసంస్థలకు ఏపీ ఉన్నత విద్య నియంత్రణ కమిషన్ హెచ్చరిక
అమరావతి, ఆగస్టు 26: రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ హెచ్చరించింది. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను అక్రమంగా తమ వద్ద ఉంచి ఇబ్బందులకు గురిచేస్తున్న విద్యాసంస్థలకు రూ.15 లక్షల వరకు జరిమానా విధిస్తామని కమిషన్ స్పష్టం చేసింది.
కోర్సులు పూర్తి చేసిన అనంతరం కూడా విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆలస్యం చేయడం, అధిక ఫీజులు వసూలు చేయడం వంటి అంశాలపై కమిషన్‌కు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నట్లు తెలిపింది. ఈ కారణంగా విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
నిబంధనల ప్రకారం విద్యాసంస్థలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను తమ వద్ద నిల్వ ఉంచకూడదని కమిషన్ స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై భారీ జరిమానాతో పాటు, అవసరమైతే వాటి గుర్తింపును రద్దు చేయాలని సంబంధిత విశ్వవిద్యాలయాలకు సిఫార్సు చేస్తామని వెల్లడించింది.
విద్యార్థులు, తల్లిదండ్రులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటే 87126 27318, 08645-274445 నంబర్లకు కమిషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని సూచించింది. అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి 1100, వినియోగదారుల ఫిర్యాదుల కోసం 1915 హెల్ప్‌లైన్‌లను వినియోగించుకోవచ్చని తెలిపింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నిర్వహించే 'స్పందన' కార్యక్రమం ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని కమిషన్ పేర్కొంది.

