అక్షర శ్రీ పాఠశాలపై విద్యాశాఖ మౌనం వీడాలి: డీఎస్ఎఫ్ డిమాండ్

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి వినూత్న నిరసన

​అధిక ఫీజుల దోపిడీ, సీబీఎస్ఈ గుర్తింపుపై విచారణ జరపాలని డిమాండ్

​ఆదోని: ఆదోని పట్టణంలోని రామ్‌జల్ ఏరియాలో ఉన్న అక్షర శ్రీ పాఠశాల అక్రమాలపై ఫిర్యాదు చేసి వారం రోజులు గడుస్తున్నా విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని డీఎస్ఎఫ్ (DSF) కార్యదర్శి బాలు మండిపడ్డారు. అధికారుల ఉదాసీన వైఖరికి నిరసనగా శుక్రవారం పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి సంఘం నాయకులు వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు.



​ఈ సందర్భంగా డీఎస్ఎఫ్ కార్యదర్శి బాలు మాట్లాడుతూ... పాఠశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ఫీజుల దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులకు రూ. 20,000 నుంచి రూ. 30,000 వరకు, 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల నుంచి వివిధ పేర్లతో రూ. లక్షకు పైగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

​పాఠశాలకు అసలు సీబీఎస్ఈ గుర్తింపు ఉందో లేదో విద్యాశాఖ అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం తరగతి గదుల విస్తీర్ణం, భవన భద్రత, పారిశుధ్యం, ఆటస్థలం వంటి మౌలిక వసతులు ఉన్నాయా లేదా అని తనిఖీ చేయాలన్నారు. ప్రత్యేకించి దివ్యాంగ విద్యార్థుల కోసం ర్యాంప్ మార్గాలు, లిఫ్ట్ సౌకర్యాలు కల్పించారా అనేది అధికారులు నిర్ధారించాలన్నారు.

​విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశంపై అధికారులు నిర్లక్ష్యం వీడి, తక్షణమే క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు నిజమని తేలితే సదరు పాఠశాల గుర్తింపు రద్దు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

​ఈ కార్యక్రమంలో డీఎస్ఎఫ్ నాయకులు వంశీ, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.