ఆరుగురు రైల్వే ఉద్యోగులకు డీఆర్‌ఎం భద్రతా పురస్కారాలు

అప్రమత్తతతో ప్రమాదాల నివారణ: ఆరుగురు రైల్వే ఉద్యోగులకు డీఆర్‌ఎం భద్రతా పురస్కారాలు



విశాఖపట్నం: విధి నిర్వహణలో విశేష అప్రమత్తత, సమయస్ఫూర్తి కనబరిచి రైల్వే ప్రమాదాలను నివారించిన ఆరుగురు సిబ్బందికి విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) లలిత్ బోహ్రా భద్రతా పురస్కారాలు అందజేశారు. జూన్ నుంచి ఆగస్టు 2026 కాలానికి సంబంధించి విశాఖ డివిజనల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏడీఆర్‌ఎంలు, సీనియర్ డివిజనల్ అధికారులు (Sr.DOM, Sr.DSC, Sr.DEE/OP) సమక్షంలో ఈ అవార్డుల ప్రదానం జరిగింది. రైళ్ల రాకపోకల సమయంలో ఏర్పడిన సాంకేతిక లోపాలు, భద్రతాపరమైన సమస్యలను సకాలంలో పసిగట్టి ఉన్నతాధికారులను అప్రమత్తం చేసినందుకు గాను కింది ఉద్యోగులు ఈ పురస్కారాలను అందుకున్నారు:



బి.కె. పవన్ కుమార్ (సీనియర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్/SCMN): రోలింగ్ పరీక్షలో వ్యాగన్ కాయిల్ స్ప్రింగ్ లోపాన్ని గుర్తించారు.



నూక ఉమామహేశ్వరరావు (సీనియర్ ట్రైన్ మేనేజర్/SCMN): సిగ్నల్స్ మార్పిడి సమయంలో పక్క లైన్ రైలు వ్యాగన్ల అడాప్టర్లు వాలి ఉండటాన్ని పసిగట్టారు.



టి. విజయ కుమార్ (లోకో పైలట్ - గూడ్స్/MGPV): తనిఖీల్లో వ్యాగన్ పీయూ క్యాప్, హెలికల్ స్ప్రింగ్ దెబ్బతినడాన్ని గుర్తించారు.



బత్తుల కోటేశ్వరరావు (సీనియర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్/SCMN): కదులుతున్న రైలులో యాక్సిల్ అడాప్టర్ వాలడాన్ని గుర్తించి సీ అండ్ డబ్ల్యూ సిబ్బంది ద్వారా సరిచేయించారు.



వి.కె. సింగ్ (గూడ్స్ ట్రైన్ మేనేజర్/SCMN): ఆయిల్ లీకేజీ, చివరి బ్రేక్‌వ్యాన్‌లో హ్యాండ్ బ్రేక్ పనిచేయకపోవడాన్ని నివేదించారు.



వరహాల బాబు డొంక (లోకో పైలట్ - గూడ్స్/MGPV): ట్రాలీ సైడ్ బేరర్లు స్థానభ్రంశం చెందిన విషయాన్ని సకాలంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 

ఈ సందర్భంగా డీఆర్‌ఎం లలిత్ బోహ్రా మాట్లాడుతూ.. రైళ్ల సురక్షిత రాకపోకల్లో సిబ్బంది చూపిన బాధ్యతాయుతమైన ప్రవర్తన, సమయస్ఫూర్తి ప్రశంసనీయమని కొనియాడారు. భద్రతా నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను అరికట్టేలా ఉద్యోగులను ప్రోత్సహించేందుకే ఈ పురస్కారాలు అందిస్తున్నట్లు తెలిపారు.