హెచ్‌పీసీఎల్‌లో అన్యాయానికి గురైన కార్మికుడికి అండగా ‘విశాఖ అన్ ఆర్గనైజ్డ్ వర్కర్స్ యూనియన్
యూనియన్ పోరాటంతో కార్మికుడికి దక్కిన న్యాయం: హెచ్చరించిన అధ్యక్షుడు గుత్తుల మధుబాబు
విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్): హెచ్‌పీసీఎల్ (HPCL) పరిధిలోని కాంట్రాక్ట్ కంపెనీలో విధులు నిర్వహిస్తూ అకారణంగా ఉద్వాసనకు గురైన ఓ పేద కార్మికుడికి ‘విశాఖపట్నం అన్ ఆర్గనైజ్డ్ వర్కర్స్ యూనియన్’ అండగా నిలిచి న్యాయం చేసింది.
గత రెండు నెలల క్రితం రాజ్ కుమార్ సింగ్ అనే కాంట్రాక్ట్ కార్మికుడికి, హెచ్‌పీసీఎల్‌లో పనిచేస్తున్న ‘ఎక్సలెంట్’ కాంట్రాక్ట్ సంస్థ యాజమాన్యానికి మధ్య చిన్నపాటి వివాదం తలెత్తింది. తన సమస్యలపై ప్రశ్నించినందుకు సదరు యాజమాన్యం అతనిపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించింది. ఉపాధి కోల్పోయి, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో రోడ్డున పడ్డ బాధితుడు చివరకు విశాఖపట్నం అన్ ఆర్గనైజ్డ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు గుత్తుల మధుబాబును కలిసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. కార్మికుడి దీనస్థితిపై తక్షణమే స్పందించిన మధుబాబు.. ఈ వ్యవహారంపై లేబర్ కార్యాలయంలో అధికారికంగా ఫిర్యాదు దాఖలు చేశారు. లేబర్ అధికారుల సమక్షంలో హెచ్‌పీసీఎల్ ప్రతినిధులు, ఎక్సలెంట్ కాంట్రాక్ట్ ఏజెన్సీ యాజమాన్యంతో చర్చలు జరిపి, యాజమాన్యం చేసిన తప్పును ఎత్తిచూపారు. యూనియన్ నిరంతర ఒత్తిడి, పోరాట ఫలితంగా చివరకు సదరు సంస్థ దిగివచ్చి బాధితుడు రాజ్ కుమార్ సింగ్‌కు న్యాయం చేసింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు గుత్తుల మధుబాబు మాట్లాడుతూ.. పరిశ్రమల్లో శ్రమిస్తున్న కాంట్రాక్ట్, అసంఘటిత రంగ కార్మికుల హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కార్మికులను అకారణంగా వేధించినా, తొలగించినా విశాఖపట్నం అన్ ఆర్గనైజ్డ్ వర్కర్స్ యూనియన్ తరపున న్యాయపోరాటం చేస్తామని, యాజమాన్యాలు కార్మిక చట్టాలను గౌరవించాలని స్పష్టం చేశారు.


