బాలల వికాసమే లక్ష్యంగా బాలల దినోత్సవ పోటీలు



విశాఖపట్నం: బాలలలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆసరా చారిటబుల్ సొసైటీ సహకారంతో జిల్లా వ్యాప్తంగా బాలల దినోత్సవ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 175 కేంద్రాల పరిధిలోని చిన్నారుల కోసం సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాలలో వివిధ క్రీడా, సృజనాత్మక, మేధోపరమైన పోటీలను ఏర్పాటు చేసినట్లు క్లబ్ కన్వీనర్ కె. సుశీల తెలిపారు.



బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కబడ్డీ, ఖో-ఖో, రన్నింగ్, మ్యూజికల్ చైర్స్ వంటి క్రీడా పోటీలతో పాటు వ్యాసరచన, ఉపన్యాసం, డ్రాయింగ్ వంటి పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బాలలు ఉత్సాహంగా పాల్గొనేలా ప్రోత్సహించడం, వారిలోని ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమన్నారు.



బాలలలో స్నేహభావం, సమిష్టితత్వం, శాస్త్రీయ ఆలోచన, పరస్పర సహకారం, శ్రమ పట్ల గౌరవం, పర్యావరణ పరిరక్షణ వంటి ఉన్నత విలువలను పెంపొందించేందుకు వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. నివాస ప్రాంతాల్లో చిన్నారులను చిల్డ్రన్స్ క్లబ్బులుగా ఏర్పాటు చేసి, ఏడాది పొడవునా వారి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.



చిల్డ్రన్స్ క్లబ్బులతో పాటు 40 క్రియేటివ్ లెర్నింగ్ సెంటర్ల ద్వారా నగరవ్యాప్తంగా మొత్తం 175 కేంద్రాలలో వేలాది మంది పిల్లలకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేరువ చేస్తున్నట్లు కె. సుశీల వెల్లడించారు. బాలలలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెంపొందించడమే తమ సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు.

 కె. సుశీల 

కన్వీనర్, వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్