నౌసనాబాగ్ కేవీ–2 స్కూల్లో వైభవంగా ముందస్తు క్రిస్మస్, మాథ్స్ డే వేడుకలు



విశాఖపట్నం (పారిశ్రామిక ప్రాంతం): పండుగ సెలవుల నేపథ్యంలో నౌసనాబాగ్ కేంద్రీయ విద్యాలయం–2 (కేవీ–2) లో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఇన్‌చార్జి ప్రిన్సిపల్ బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయురాలు సౌజన్య పర్యవేక్షణలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.



ఆర్ట్ ఎడ్యుకేషన్‌లో భాగంగా 5వ తరగతి విద్యార్థులు సుమారు 6 అడుగుల ఎత్తైన క్రిస్మస్ ట్రీని తరగతి గదిలోనే ఆర్ట్ పీరియడ్‌లో కళాత్మకంగా రూపొందించారు. విద్యార్థుల సృజనాత్మకత ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇదే సందర్భంలో డిసెంబర్ 22న గణిత శాస్త్ర వేత్త శ్రీనివాస రామానుజం జయంతిని పురస్కరించుకుని మాథ్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. అధికారులు రామానుజానికి నివాళులు అర్పించగా, విద్యార్థులు తయారు చేసిన వివిధ గణిత ప్రాజెక్టులను ప్రదర్శించి తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, విజ్ఞానాసక్తిని పెంపొందించేలా ఈ కార్యక్రమాలు విజయవంతంగా సాగాయి.