ఆంధ్ర ప్రదేశ్ ప్రజా రవాణా శాఖ
విశాఖపట్నం, తేదీ.07.02.2026 న మద్దిలపాలెం డిపోలో ఐటీ ఎంప్లాయిస్ రవాణా సౌకర్యార్ధం విశాఖపట్నం లోని పలు ప్రాంతాలనుండి మధురవాడ ఐటీ హిల్స్ కు ఇప్పటివరకు నడుపుతున్న 8 బస్సులకు అదనంగా 2 ప్రత్యేక బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలి దశలో 4 బస్సులను తేదీ. 21.10.2024 నుండి నడపడమైనదని, రెండవ దశలో మరో నాలుగు బస్సులను తేదీ 17.05.2025 నుండి నడుపుతున్నామని, దీని వలన సంవత్సరానికి సుమారు రూ.1,29,85,056/- వరకు ఐ.టి. ఎంప్లొయీస్ లబ్ది పొందుతున్నారని తెలిపినారు. అలాగే, ఐ.టి.హిల్స్ ఎంప్లాయిస్ సంఖ్య పెరుగుతూ ఉండడం వలన, ఈ 8 బస్సులకు అదనముగా మరో 2 బస్సులను నడుపుటకు ఏర్పాటు చేయడమైనది. ఈ 2 బస్సులలో ఒక బస్సును కొత్తవలస నుండి, రెండవ బస్సును విజయనగరం నుండి మధురవాడ ఐ.టి.హిల్స్ కు నడపడం జరుగుతున్నదని అన్నారు.
కూటమి ప్రభుత్వం, విశాఖపట్నం ను ఐ.టి. హబ్ గా రూపొందించే కృషిలో దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్ లో నిలుపుటకు తీసుకుంటున్న నిర్ణయాలలో భాగంగా, విశాఖపట్నం మరియు విజయనగరం లో గల వివిధ ప్రాంతాలనుండి మధురవాడ ఐ.టి.హిల్స్ కు ప్రత్యేక బస్సులను నడుపుచున్నామని తెలియజేసినారు. అదేవిధంగా ప్రజలకు మరింత రవాణా సౌకర్యం కల్పించేందుకుగాను, రాష్ట్ర వ్యాప్తంగా 700 ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలుచేయనున్నట్లు, దానిలో భాగంగా 100 ఎలక్ట్రికల్ బస్సులను విశాఖపట్నం జిల్లా కి కేటాయించుట జరిగినదని తెలియజేసినారు.
స్త్రీ శక్తి (మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యం) పధకంలో భాగంగా, అత్యధిక మహిళలకు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంలో విశాఖపట్నం జిల్లా, రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని ఏ.పి.యస్.ఆర్.టి.సి, విశాఖపట్నం జిల్లాలో సంక్రాంతి పండుగ స్పెషల్ ఆపరేషన్ లో భాగంగా సుమారు 1105 బస్సులను నడిపి, అత్యధిక ఆదాయం తీసుకువచ్చిన అన్ని డిపోలలో కండక్టర్ల, డ్రైవర్లకు మరియు బస్సులను ఎప్పటికప్పుడు నిర్వహణ చేస్తూ మంచి కండిషన్ గల బస్సులను అందించిన మెకానిక్ సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేసి వారికి అభినందనలు తెలియజేసినారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలతో ఏ.పి.యస్.ఆర్.టి.సి, విశాఖపట్నం జిల్లాలో అర్హులైన వివిధ కేటగిరీలలో (కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్ లు) పదోన్నతి పొందిన ఉద్యోగులకు పదోన్నతా పత్రాలను అందజేసినారు.
ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి భరత్, యమ్.ఎల్.ఏ.లు వెలగపూడి రామకృష్ణ బాబు, పి.విష్ణు కుమార్ రాజు, ఆర్.టి.సి. జోనల్ చైర్మన్ దొన్ను దొర, ఏ.పి.ఈ.డి.బి. మేనేజర్ (ఐ.టి) శ్రీమతి పి. కీర్తన ఆనంద్, ఏ.పి.యస్.ఆర్.టి.సి. విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి జి.విజయగీత, విశాఖపట్నం జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి.సత్యనారాయణ, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ ఏ.గంగాధర రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(సివిల్) కె. వి. అరుణ్ కుమార్, పర్సనల్ ఆఫీసర్ జె.తిరుపతి, అకౌంట్స్ ఆఫీసర్ కుమారి వి.వంశీ మోహిని, డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు, ఉద్యోగ సంఘాల నాయకులు, మరియు అనేక మంది సిబ్బంది పాల్గొన్నారు.



