మృత్యుశకటం
వసుంధర (ఫైల్ ఫొటో)
భర్త, కుమారుడికి తీవ్ర గాయాలు అక్కిరెడ్డిపాలెం
ఫిబ్రవరి 7: అనకాపల్లిలో తమ తల్లిగారి ఇంటి వద్ద ఆనందంగా గడపాలని వెళ్తున్న ఆ మహిళను లారీ మృత్యురూపంలో కబళించగా, ఆమె భర్త, కుమారుడు తీవ్రగాయాలతో త్రుటిలో ప్రాణా పాయం నుంచి బయటపడ్డారు. ఈ విషాదకర సంఘటన జాతీయ రహదారిపై షీలానగర్ వద్ద చోటుచేసుకుంది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ఏడీ దరి బుచ్చిరాజుపాలెంకు చెందిన మదుపాక శ్రీనివాస్ తన భార్య వసుంధర (36), ఆరేళ్ల కుమారుడు దేవతో కలసి అనకాపల్లిలో ఉన్న అత్తవారింటికి శనివారం మధ్యాహ్నం ద్విచ క్రవాహనంపై బయలుదేరాడు. షీలానగర్ జంక్షన్ సమీపంలో లారీ పార్కింగ్ యార్డు దగ్గరకు వచ్చేసరికి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండ డంతో సర్వీస్ రోడ్డులో వెళ్తున్న శ్రీనివాస్ ద్విచక్రవాహనాన్ని అదే దిశలో వస్తూ, లారీ పార్కింగ్ యార్డులోకి వెళ్తున్న లారీ వెనుక నుంచి బలంగా డీకొ ట్టింది. దీంతో వసుంధర ఒక వైపు, ఆమె భర్త శ్రీనివాస్, కుమారుడు దేవ రహదారిపై మరోవైపు పడిపోయారు. వసుంధర తల పైనుంచి లారీ చక్రాలు వెళ్లడంతో ఆమె తల, ఛాతిభాగం నుజ్జయ్యి అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీనివాస్ కాళ్లు, చేతులకు గాయాలు కాగా, కుమారుడు దేవ కాలు, చేతికి తీవ్ర గాయాలై ప్రాణాలతో బయటపడ్డారు. కళ్ల ముందే భార్య వసుంధర మృతిచెందడంతో శ్రీనివాస్ తీవ్ర ఆవేదనకు గురికాగా, తీవ్రంగా గాయపడిన దేవ తనకు తన తల్లి కావాలంటూ చేసిన రోదన స్థానికులను కంట తడిపెట్టించింది. ప్రమాద వార్త తెలుసుకున్న వసుంధర కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా విలపించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ కె.మోహనన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వసుంధర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించిన గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

