మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపంపై గడ్డం నాగేంద్ర ఆగ్రహం...

ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు మృత్యుధారగా గుడికల్ చెరువు నీరు – మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపంపై బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షులు గడ్డం నాగేంద్ర ఆగ్రహం.



కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చాల్సిన గుడికల్ చెరువు నేడు మురుగు నీరు, గుర్రపుడెక్క మరియు రసాయన వ్యర్థాలతో నిండి మృత్యుకూపంగా మారిందని బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షులు గడ్డం నాగేంద్ర తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన సమితి నాయకులతో కలిసి గుడికల్ చెరువును సందర్శించి, అక్కడి భయానక పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

ఈ సందర్భంగా గడ్డం నాగేంద్ర విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ అధికారుల తీరుపై నిప్పులు చెరుగుతూ చెరువులోని నీరు ఎంతగా కలుషితమైందంటే, అందులోని చేపలు కూడా జీవించలేక చనిపోయి నీటిపై తేలుతున్నాయి. అటువంటి విషతుల్యమైన నీటినే మున్సిపల్ అధికారులు పట్టణ ప్రజలకు సరఫరా చేయడం అత్యంత దారుణం అన్నారు. మున్సిపల్ కమిషనర్ మరియు సంబంధిత ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఫిల్టర్ బెడ్ల నిర్వహణ గాలికి వదిలేశారని, క్లోరినేషన్ ప్రక్రియ కేవలం కాగితాలకే పరిమితమైందని ఆయన ధ్వజమెత్తారు.ఈ అపరిశుభ్ర నీటిని తాగడం వల్ల పట్టణ ప్రజలు కలరా, టైఫాయిడ్, కామెర్లు వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని, తక్షణమే నీటి నాణ్యతను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.

స్థానిక ఎమ్మెల్యే కూడా ఒకసారి స్వయంగా గుడికల్ చెరువును విజిట్ చేయాలని, అధికారుల మాటలు నమ్మకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. వచ్చే పది రోజుల్లోగా గుడికల్ చెరువు గుర్రపుడెక్కను తొలగించి, పైపులైన్ల లీకేజీలను అరికట్టి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయకుంటే, బహుజన సేన సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తాం" అని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టబోమని గడ్డం నాగేంద్ర హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన సమితి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.