గిరిజనులకు ఇచ్చిన ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలి

గిరిజనులకు ఇచ్చిన ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలి - GO No.3కు చట్టబద్ధత కల్పించి, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి: ఏపీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి



అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో శుక్రవారం GO No.3కు చట్టబద్ధత కల్పించడం, 1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం తదితర ప్రధాన డిమాండ్లతో సోషల్ మీడియా క్రియేటర్లు, గిరిజన సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి గిరిజనులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అరకు, పాడేరు, చింతపల్లి, అనంతగిరి, జి.కే.వీధి, హుకుంపేట, పెదబయలు, ముంచింగిపుట్టు తదితర ఏజెన్సీ మండలాల నుంచి వేలాదిగా గిరిజనులు, యువత, మహిళలు హాజరై తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.



ర్యాలీలో పాల్గొన్న ఏపీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా GO No.3కు చట్టబద్ధత కల్పించి అమలు చేయాలని, అలాగే 1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేసి గిరిజన భూములను పరిరక్షించాలని కోరారు.



గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు, విద్య, ఉపాధి అవకాశాల్లో స్థానిక గిరిజనులకు రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. గిరిజనుల హక్కులను బలహీనపరిచే ఎలాంటి నిర్ణయాన్నైనా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.



ర్యాలీలో పాల్గొన్న గిరిజన నాయకులు మాట్లాడుతూ, GO No.3 అమలు గిరిజన నిరుద్యోగ యువతకు న్యాయం చేయడమే కాకుండా రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించే చర్య అని పేర్కొన్నారు. అలాగే 1/70 చట్టం గిరిజన భూములను గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడే కీలక చట్టమని, దానిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ప్రభుత్వం గిరిజనుల న్యాయమైన డిమాండ్లపై వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఏజెన్సీ వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ర్యాలీలో పాల్గొన్న యువత "GO No.3 అమలు చేయాలి", "1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి", "గిరిజన హక్కులను పరిరక్షించాలి" అంటూ నినాదాలతో పాడేరు పట్టణాన్ని హోరెత్తించారు. ఏజెన్సీ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకావడంతో ర్యాలీ విజయవంతంగా ముగిసింది. 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం. ప్రేమ్ కుమార్, భాను, సిహెచ్. రావు, గంపరాయి సమ్మారెడ్డి, బంగర్ రాజు తదితరులు, గిరిజన సంఘాల నాయకులు, యువజన ప్రతినిధులు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.