వరి సాగులో ‘తడి–పొడి’ విధానంతో రైతులకు అదనపు ఆదాయం

వరి సాగులో ‘తడి–పొడి’ విధానంతో రైతులకు అదనపు ఆదాయం
హెక్టారుకు 30 అమెరికన్ డాలర్ల వరకు కార్బన్ క్రెడిట్ ప్రయోజనం
రైతులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం ఉండదు: పృథ్వి కార్బన్ సొల్యూషన్స్ సీఈఓ ఎం.ఎస్.ఎన్. మూర్తి



పార్వతీపురం, జూలై 28: వరి సాగు ద్వారా వెలువడే గ్రీన్‌హౌస్ వాయువుల్లో ప్రధానమైన మిథేన్ ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ‘తడి–పొడి’ సాగు విధానాన్ని రైతులు అవలంబించాలని పృథ్వి కార్బన్ సొల్యూషన్స్ సీఈఓ ఎం.ఎస్.ఎన్. మూర్తి సూచించారు. మంగళవారం పార్వతీపురంలోని స్థానిక ఎన్జీవో హోమ్‌లో అమెరికన్ సంస్థ అగ్రి క్యాప్చర్, పృథ్వి కార్బన్ సొల్యూషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో రైతులు, స్థానిక భాగస్వాములు, వాటాదారులతో అవగాహన సదస్సు నిర్వహించారు.



ఈ సందర్భంగా ఎం.ఎస్.ఎన్. మూర్తి మాట్లాడుతూ.. 110 నుంచి 120 రోజుల వరి పంట కాలంలో కనీసం రెండుసార్లు పొలాన్ని ఎండబెట్టి, అనంతరం అవసరమైన మేరకు నీటిని అందించే ‘తడి–పొడి’ విధానాన్ని పాటించడం ద్వారా మిథేన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. ఈ విధానం వల్ల పంట దిగుబడిపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందని తెలిపారు.



తడి–పొడి సాగు విధానానికి అవసరమైన పైపులను కంపెనీ ఉచితంగా అందిస్తుందని, రైతుల నుంచి ఎలాంటి రుసుము లేదా అదనపు ఆర్థిక భారం వసూలు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. వరుసగా రెండు సీజన్లలో వరి సాగు చేసే రైతులు ఈ విధానాన్ని పాటిస్తే కార్బన్ క్రెడిట్స్ ద్వారా హెక్టారుకు సుమారు 30 అమెరికన్ డాలర్ల వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు.



ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టు లక్ష్యాలు, ప్రయోజనాలను రైతులు, ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులకు వివరించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రైతులకు డెమో ద్వారా తడి–పొడి సాగు విధానంపై అవగాహన కల్పించారు.



ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పృథ్వి కార్బన్ సొల్యూషన్స్ ప్రతినిధులు, స్థానిక రైతులు, భాగస్వాములు పాల్గొన్నారు.