లమ్మసింగి జంక్షన్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది
హైవే పనుల సమయంలో విద్యుత్ తీగలను తాకిన టిప్పర్
లమ్మసింగి, సెప్టెంబర్ 5: అల్లూరి సీతారామరాజు జిల్లా లమ్మసింగి జంక్షన్ నుంచి చింతపల్లి వెళ్లే జాతీయ రహదారి-516పై శనివారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. హైవే డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం కంకర రాయి లోడును టిప్పర్ ద్వారా అన్లోడ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
టిప్పర్ తోట్టెను హైడ్రాలిక్ ద్వారా పైకి ఎత్తుతుండగా, బురదవీధి గ్రామానికి విద్యుత్ సరఫరా చేసే హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకింది. దీంతో ఒక్కసారిగా స్పార్కింగ్ ఏర్పడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక విద్యుత్ తీగ తెగిపడి టిప్పర్‌పై పడటంతో స్వల్ప మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై లమ్మసింగి విద్యుత్ ఉపకేంద్ర అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన విద్యుత్ శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని విద్యుత్ సరఫరా నిలిపివేసి మరమ్మతు పనులు చేపట్టారు. అదృష్టవశాత్తు ఘటన జరిగిన సమయంలో జాతీయ రహదారిపై ఇతర వాహనాలు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదు. టిప్పర్ డ్రైవర్ కూడా సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రహదారి నిర్మాణ పనుల సమయంలో విద్యుత్ తీగల సమీపంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.

