కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి గ్రామస్తులు, దాతల అండ

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి గ్రామస్తులు, దాతల అండ - ₹19,400 ఆర్థిక సాయం అందజేత



గ్రామీణం: తీవ్రమైన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న మాడెం గ్రామానికి చెందిన 15 ఏళ్ల చిన్నారి వంతల ప్రదీప్ కుమార్‌కు గ్రామ యువత, డ్వాక్రా మహిళలు, దాతలు అండగా నిలిచారు. ప్రదీప్ కుమార్ వైద్య ఖర్చుల నిమిత్తం సేకరించిన ₹19,400 ఆర్థిక సహాయాన్ని ఆదివారం బాధితుడి కుటుంబానికి అందజేశారు.



రెండు కిడ్నీలు పాడై ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి పరిస్థితిని చూసి చలించిన మాడెం గ్రామ యువత, వైద్య ఖర్చుల నిమిత్తం దాతలను, నాయకులను ఆశ్రయించింది. ఈ క్రమంలో దుక్కేరి ప్రభాకర్‌ను సంప్రదించగా, ఆయన సహకారంతో 'డీపీఆర్ జై ఆదివాసీ జై భీమ్ స్వచ్ఛంద సేవా ట్రస్ట్' ద్వారా నిధుల సేకరణ చేపట్టారు. ఈ పిలుపునకు స్పందించిన పలువురు దాతలు, స్థానిక డ్వాక్రా సంఘాల మహిళలు, గ్రామస్తులు ముందుకొచ్చి తమ వంతు సాయాన్ని అందించారు. సేకరించిన మొత్తాన్ని అందజేస్తూ, ఆపద సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని గ్రామస్తులు భరోసా ఇచ్చారు.



ఈ కార్యక్రమంలో దుక్కేరి ప్రభాకరరావు, గంగాపూజారి విజయ్ భాస్కర్, పాంగి దారబాబు, బురిడీ నాగరాజు, సీదారి మూర్తి, కూడ పల్లనాయుడు, బురిడీ సత్తిబాబు, వంతల కాశీరాజు తదితరులతో పాటు గ్రామ యువత, స్థానికులు పాల్గొన్నారు. చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ఉదారంగా స్పందించిన ప్రతి ఒక్కరికీ మాడెం గ్రామ యువత ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.