నినాదాలు కాదు.. బాలల జీవితాల్లో ఆనందం కావాలి

బాలల బడ్జెట్‌ను పెంచి వారి వర్తమానాన్ని కాపాడాలి: బీజేపీ నేత మూల వెంకటరావు



విశాఖపట్నం: బాలల దినోత్సవం కేవలం పాఠశాలల్లో నిర్వహించే ఒక రోజు వేడుకలకు, ఆకర్షణీయమైన నినాదాలకు మాత్రమే పరిమితం కాకూడదని బీజేపీ జనతా వారధి కో-కన్వీనర్ మూల వెంకటరావు అన్నారు. చిన్నారుల హక్కులు, స్వేచ్ఛ, శ్రేయస్సును కాపాడినప్పుడే ఈ దినోత్సవానికి నిజమైన సార్థకత చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి చిన్నారికి నిర్భయమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన జీవన వాతావరణాన్ని అందించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఒక పిల్లవాడి ఎదుగుదల చుట్టూ కుటుంబం, బడి, ఊరు, ప్రభుత్వం అనే నాలుగు ప్రధాన రక్షణ వలయాలు ఉంటాయని, వీటిలో ఏ ఒక్కటి బలహీనపడినా బాలల భవిష్యత్తు అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 



నినాదాలు క్షేత్రస్థాయిలో ప్రతిబింబించాలి: పాఠశాలకు వెళ్లాల్సిన వయసులో పనికి వెళ్లే బాలుడికి తన హక్కుల గురించి ఎవరు చెబుతారని వెంకటరావు ప్రశ్నించారు. హింస, వివక్ష, బాల్య వివాహాలు, అక్రమ రవాణా వంటి సమస్యల మధ్య నలిగిపోతున్న చిన్నారులకు "నా హక్కు, నా రోజు, నా భవిష్యత్" అనే నినాదాలు ఎంతవరకు వర్తిస్తాయని అన్నారు. నినాదాలు వినడానికి అందంగా ఉన్నా, అవి పేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపినప్పుడే వాటికి అర్థం ఉంటుందన్నారు. బడ్జెట్ కేటాయింపులు పెంచాలి: ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ (NFHS) సర్వే ప్రకారం దేశంలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో 19 శాతం మంది తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతుండటం ఆందోళనకరమని అన్నారు. ఆడుకోవాల్సిన వయసులో పనిచేయడం, చదువుకోవాల్సిన వయసులో కుటుంబ బాధ్యతలు మోయడం అత్యంత బాధాకరమన్నారు. బాలల హక్కుల విశ్లేషణ ప్రకారం 2025-26 కేంద్ర బడ్జెట్‌లో బాలల సంక్షేమానికి కేటాయించిన నిధుల వాటా కేవలం 2.29 శాతం మాత్రమే ఉందని, ప్రభుత్వాలు ఈ పరిస్థితిని మార్చి బాలల బడ్జెట్‌ను గణనీయంగా పెంచాలని డిమాండ్ చేశారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, బాలల రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని కోరారు. "పిల్లలు దేశ భవిష్యత్తు అని మాటలు చెప్పడం కాదు.. ముందుగా వారి వర్తమానాన్ని కాపాడి, మంచి జీవితాన్ని అందించినప్పుడే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుంది" అని మూల వెంకటరావు స్పష్టం చేశారు.