ఖాళీగా ఉన్న సీట్లను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్
స్పాట్ అడ్మిషన్లు లేకపోతే పేద విద్యార్థులకు తీరని అన్యాయం
కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయంలో పీజీ స్పాట్ అడ్మిషన్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (DSF) డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం డీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ కిరణ్ మాట్లాడారు.
విశ్వవిద్యాలయంలోని వివిధ పీజీ కోర్సుల్లో ఇంకా పెద్ద ఎత్తున సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ, స్పాట్ అడ్మిషన్లు నిర్వహించకపోవడం విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆసక్తి ఉన్న ఎంతోమంది విద్యార్థులు అడ్మిషన్లు దొరకక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలే ప్రధాన ఆధారమని, ఇలాంటి పరిస్థితుల్లో స్పాట్ అడ్మిషన్లను రద్దు చేయడం వల్ల వారు ఉన్నత చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి, ఖాళీగా ఉన్న పీజీ సీట్లన్నింటినీ భర్తీ చేసేందుకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్య అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు, వర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.


