విశాఖలో అగ్ని ప్రమాదానికి గురైన మత్స్యకారుల బోట్..

విశాఖపట్నం: విశాఖలో అగ్ని ప్రమాదానికి గురైన మత్స్యకారుల బోట్..



విశాఖ ఫిషింగ్ హార్బర్ కు అతి సమీపంలో అగ్ని ప్రమాదానికి గురైన మత్స్యకారుల బోట్. వాసుపల్లి అప్పయ్యమ్మ కు చెందిన ఓ బోటులో ఐదుగురు మత్స్యకారులు వేటకు బయలుదేరి వెళ్లారు. తీరానికి 35 మైళ్ళ దూరంలో వెళ్ళగానే బోట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇంజన్ నుంచి మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో పూర్తిగా బోటు దగ్ధమైంది. బోట్లో ఉన్న ఐదుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకారు. అక్కడికి సమీపంలో ఉన్న కోస్ట్ గార్డ్ సిబ్బంది వారిని రక్షించి మరో బోట్లో ఎక్కించి తీరానికి క్షేమంగా చేర్చారు. ప్రమాదానికి గురైన బోటు విలువ సుమారు 40 లక్షలు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.

ప్రమాదంపై ఆరా తీసిన అచ్చెన్నాయుడు

సముద్రంలో చేపలు వేటకు వెళ్లిన బోటు ప్రమాదం పై రాష్ట్ర వ్యవసాయ ,మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. మత్స్యకారుల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఐదుగురు మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని విశాఖ మత్స్యశాఖ అధికారిని విజయ మంత్రికి వివరించారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై మత్స్యకారులకు అవగాహన పెంచాలని మంత్రి తెలిపారు..