రైతు నేతల పిలుపు

జూలై 9న సమ్మెను గ్రామీణ హర్తాళ్ల్ ను విజయవంతం చేయాలి.



విజయవాడ: ఇండో అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ను తిరస్కరించాలని తద్వారా దేశీయ రైతాంగానికి రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల రాష్ట్ర కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం పంటలు పండే భూములను లక్షలాది ఎకరాలను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు.రైతు, ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో రైతులు, కౌలురైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు తదితర అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

జూలై9న జాతీయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు తలపెట్టిన సమ్మెను, హర్తాళ్ల్ ను జయప్రదం చేయాలని కోరుతూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం రాష్ట్ర రైతు సంఘాల సమావేశం వడ్డేశోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వివిధ రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక సంఘాలా నాయకులు పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా వడ్డే మాట్లాడుతూ ఈ ఏడాది అన్ని పంటల ధరలు పడిపోయి రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో పడిందని, అన్ని పంటలు తక్కువ రేటుకు అమ్ముకొని నష్టపోయారని దీనికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే భాద్యతని ద్వజమెత్తారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం మూడు వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు సందర్భంగా మద్దతు ధరల చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చి అమలు పరచకుండా రైతాంగాన్ని ద్రోహం చేసిందన్నారు. రద్దు చేసిన చట్టాలనే మరొక రూపంలో తీసుకురావాడానికి ప్రయత్నం చేయడం సిగ్గు చేటన్నారు. మద్దతు ధరల విధానం లేకుండా జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చిందని దీని ప్రకారం మద్దతు ధరల విధానం లేకపోగా పంటలు కొనుగోలు వ్యవస్థ మొత్తం కార్పోరేట్ కంపెనీల, వ్యాపారుల వంశం అవుతుందని విమర్శించారు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, బహుళ సహకార సంస్థల చట్టం పేరుతో మొత్తం రైతులను కార్పొరేట్ ల హస్తగతం చేయడానికి రైతు వ్యతిరేక విధానాలను రూపొందించిందని, ఈ విధానాలు వల్ల భారత రైతాంగం సంక్షోభంలో కూరుకు పోతుందన్నారు. వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ వ్యవసాయ అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగాన్ని కాపాడాలని, కేరళ తరహా రుణ ఉపశమన చట్టం తెచ్చి రైతుల, వ్యవసాయ కార్మికుల, కౌలు రైతుల అన్ని రకాల పంట రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల రక్షణ, సంక్షేమం కోసం నూతన కౌలు చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న ఇంతవరకు పిఎం కిసాన్- అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు.

రైతు సంఘం సీనియర్ నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఉపసహరించుకోవాలని, సెకి, యాక్సెస్ లాంటి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం, పొగాకు కోకో, శనగ, మినుములు వగైరా పంటలు కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్క పెట్టడం వల్ల రైతులు నష్టపోయారన్నారు. మామిడి పంటను కొనుగోలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి, అమలుపరచునందున మామిడి రైతులు తమ సొంత తోటలను నరికి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. మార్కెట్ జోక్యం పథకం, ధరల స్తీరికరణ నిధి ద్వారా పంటలు కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయన్నారు. కేజీ మామిడి కాయలను రూ.12లకు చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసి మామిడి రైతులను ఆదుకోవాలని కోరారు. అఖిల భారత కిసాన్ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఎం.వెంకటరెడ్డి మాట్లాడుతూ చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించి, చెరుకు రైతులు ఆదుకోవాలని, పాల రైతులకు లీటరుకు 10రూ. చొప్పున బోనస్ ఇచ్చి ప్రోత్సహించాలని, వెనకబడిన ప్రాంతాల సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకం కింద సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని, రోజుకు రూ. 600 కూలీ పెంచాలని డిమాండ్ చేశారు. కిసాన్ సంఘటన్ రాష్ట్ర కన్వీనర్ మరీదు ప్రసాద్ బాబు మాట్లాడుతూ గత శతాబ్ద కాలంగా కార్మిక వర్గం సాధించుకున్న కార్మిక అనుకూల చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లు ప్రవేశపెట్టడం దుర్మార్గమని, ఈ నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని, కార్మికుల కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు యు.వీరబాబు మాట్లాడుతూ గిరిజనుల, వృత్తిదారుల హక్కుల కాపాడాలని, వివిధ ప్రాజెక్టుల నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. సమ్మెను, హార్తళ్ ను జయప్రదం చేయడానికి జూలై 2న అనకాపల్లిలో, జూలై 4న కర్నూల్ లో జరిగే ప్రాంతీయ రైతు కార్మిక సంఘాల సమావేశాలను జయప్రదం చేయాలని ఏకగ్రీవంగా సమావేశం తీర్మానించింది. ఈ విలేకరుల సమావేశంలో ఏఐకెఎఫ్ రాష్ట్ర నాయకులు కాసాని గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.