స్మార్ట్ మీటర్లు కాదు....స్మార్ట్ బాంబులు

విజయవాడ: అదాని స్మార్ట్ విద్యుత్ మీటర్లు, వినియోగదారుల పాలిట స్మార్ట్ బాంబులని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ  ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకే ఈ చర్యలు పాల్పడుతున్నారని విమర్శించారు. గవర్నర్ పేటలోని బాలోత్సవ భవనలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లతో విద్యుత్తు చార్జీలు మరింత భారం కానున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు భారంతోనే టిడిపి ప్రభుత్వం కుప్పకూలిపోయిందని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లతో మరోసారి టిడిపి ప్రభుత్వం పతనం కాక తప్పదు అన్నారు. బిజెపిపాలిత రాష్ట్రం రాజస్థాన్ లో స్మార్ట్ మీటర్ల ప్రజలు తిరస్కరించారని, బెంగాల్లో కూడా అదే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. మన రాష్ట్రంలో అనంతపురం, గుడివాడ, విజయవాడ, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లని వినియోగదారులు ధ్వంసం చేశారని తెలిపారు. ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా, ఏలా మీటర్ల బిగించే కార్యక్రమం చేపడతారని తప్పుపట్టారు. 



సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరావు మాట్లాడుతూ  విద్య స్మార్ట్ మీటర్లతో ప్రజలపై పెను భారాలు పడనున్నాయన్నారు. స్మార్ట్ మీటర్ల వల్ల చార్జీలు మరింత పెరుగుతాయని, స్మార్ట్ మీటర్ ధరలు కూడా వినియోగదారులు నెలసరి చెల్లించాలని వివరించారు. వాడుకున్న యూనిట్ ధరలే కాకుండా, ఆదనంగా ఇంధన చార్జీలు, సుంకాలు, ట్రూ ఆఫ్ చార్జీలు, నిర్వహణ చార్జీలు  పేరుతో వినియోగదారుల నడ్డిని విరిచే ప్రయోగమే స్మార్ట్ మీటర్లని ఎద్దేవా చేశారు. న్యూడెమోక్రసీ నగర నాయకులు పద్మ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించాలని, గృహ వినియోగదారులైన మహిళలు ఈ ఉద్యమంలో ముందుండాలని పిలుపునిచ్చారు. రెడ్ ఫ్లాగ్ నాయకులు మరీదు ప్రసాద్ బాబు మాట్లాడుతూ మరో విద్యుత్ ఉద్యమం తప్పదని, ఇందుకు టిడిపి ప్రభుత్వ కారణమని విమర్శించారు. ఆగస్టు 5న ఉద్యమం విద్యుత్ ఉధృతమవుతుందని తెలిపారు. 



రౌండ్ టేబుల్ సమావేశంలో  పలు నిర్ణయాలు చేశారు. మండల, పట్టణాల్లో మీటింగ్ లు జరపాలి. జూలై 29వరకు కరపత్రాలు పంపిణీ, సంతకాలు సేకరణ, ఇంటింటి ప్రచారం, జూలై 30నుండి ఆగస్టు 4 వరకు సమావేశాలు, పాదయాత్రలు, ప్రచారం, ప్రభాత్ బేరీలు నిర్వహించాలి. ఆగస్టు 5న విద్యుత్ సబ్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు ఆందోళనలు చేయాలి. తీర్మానాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ వెంకటేశ్వరరావు ప్రవేశ పెట్టారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ వెంకటేశ్వరరావు,ఎన్ సిహెచ్ శ్రీనివాసరావు, కోశాధికారి ఎం శ్రీనివాస్, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ సి హెచ్ సుప్రజ, నాయకులు ఎన్ నాగేశ్వరావు, వై సుబ్బారావు ఏఐటియుసి నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేఆర్ ఆంజనేయులు, ఎం సాంబశివరావు ఐఎఫ్టియు నాయకులు కె.వి రమణ, ఎం ముని శంకర్, ఏఐవైఎఫ్ గోవిందరాజులు, పిఓడబ్ల్యు నాయకులు దుర్గ, ఎఫైడబ్ల్యు నాయకులు దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు.