నెల్లూరు రోడ్ల మీద రౌడీలు...

నాయకులను నడిపిస్తే నిజమైన మార్పు వస్తుంది



మిలటరీ కవాతు చేసినట్లు, నెల్లూరు రోడ్ల మీద రౌడీలను నడిపించారు పోలీసులు. వీళ్లందరూ రౌడీలు అని జనం గుర్తించేట్లు చేశారు. రౌడీయిజానికి పాల్పడితే జైలుకు పంపుతామని కఠినమైన స్వరంతో హెచ్చరిక చేశారు పోలీసు అధికారులు. వారి ప్రయత్నం హర్షించదగిందే. సందేహం లేదు. అయితే రౌడీలకు పోలీసు లాఠీ దెబ్బలు, అడప దడపా జైలులో విశ్రాంతి అలవాటే. వాటి వల్ల రౌడీలలో మార్పు రాదు. రౌడీతనానికి మూలం రాజకీయంలో దాగివుంది. రాక్షసుడి ప్రాణం మర్రిచెట్టు తొర్రలోని చిలుక కంఠంలో దాగి వున్నట్లు, రౌడీల దుర్మార్గ ప్రవర్తన రాజకీయవాదుల ఆశ్రయంలో భద్రంగా వుంటుంది. ఎమ్మెల్యే లేదా మాజీ ఎమ్మెల్యేలు, వారిని అంటిపెట్టుకొని వుండే ఛోటా నేతలు, మరీ ముఖ్యంగా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు... ఇదంతా ఒక విషపూరితమైన కూటమి. ప్రతి రౌడీకి వీరిలో ఎవరో ఒకరి అండ వుంటుంది. రాజకీయవాది ఆశ్రయం లేకుండా రౌడీ బ్రతకలేడు; రౌడీ తోడు లేకుండా రాజకీయవాది దినచర్య గడవదు. నిజంగా రౌడీయిజం రూపు మాపాలంటే, ముందుగా హెచ్చరిక చేయవలసింది రాజకీయవాదులకు. రౌడీలను వెనకేసుకొని వచ్చినా, వారిని వదలి పెట్టమని పోలీసు స్టేషన్‌కు ఫోన్‌ చేసినా, కేసులలో వున్నప్పుడు వారు అజ్ఞాతవాసం చేయడానికి సహాయం చేసినా, ఆ రౌడీ మీద వుండే నేరారోపణ మీ మీద నమోదు చేస్తామని రాజకీయ వాదులకు హెచ్చరిక చేయగలిగే సాహసం అధికారులలో వుండాలి. అందుకు వారికి ప్రభుత్వం అండగా నిలవాలి. రాజకీయవాదుల ప్రాపకంలో వుండే కార్పొరేటర్లు తామే రౌడీలుగా రెచ్చిపోతున్నారు. కార్పొరేషన్‌, రెవెన్యూ, పోలీసు శాఖల మీద దాష్టీకం చేస్తున్నారు. గత వారమే కార్పొరేషన్‌ కార్యాలయంలో సిటీ ప్లానింగ్‌ ఆఫీసర్‌ వంటి సీనియర్‌ హోదాలో వున్న మహిళా అధికారిణిని ఒక కార్పొరేటర్‌ భర్త అసభ్యంగా తూలనాడితే, ఎవరూ పట్టించుకోలేదు. విరక్తి చెందిన ఆమె ఉద్యోగానికి సెలవు పెట్టి వెళ్లిపోయారు. అధికారులకు అండగా నిలవ వలసిన కలెక్టర్‌ వంటి ఉన్నతాధికారులు కానీ, మంత్రులు కానీ నిస్సహాయులుగా వుండి పోతున్నారు. రాజకీయ రౌడీల బారినపడి, నానా బాధలు పడుతున్న దిగువస్థాయి సిబ్బందికి, అధికారులకు ఎటువంటి సహాయం అందడం లేదు. అందువల్లనే ఆయా శాఖలు నిర్వీర్యమై పోతున్నాయి. నిజంగా రౌడీతనం అంతం కావాలంటే నడిపించవలసింది రౌడీలను కాదు; ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలను రంగడి గుడి నుంచి అయ్యప్పగుడి వరకు వీధులలో నడిపించి, మేము ఏ రౌడీకి మద్దతు ఇవ్వము, ఏ రౌడీని మా పక్కన పెట్టుకోము అని జనానికి చెప్తూ నడిపిస్తే, నిజమైన మార్పు వస్తుంది.