ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వేడుకలు

పాత తుంగపాడులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు



ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ



రాజానగరం మండలం పాత తుంగపాడు గ్రామంలో జిల్లా పరిషద్ హై స్కూల్ నందు మెగా పవర్ స్టార్ శ్రీ కొణిదెల రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి సందర్శించారు. 



ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, రామ్ చరణ్ జన్మదినం వేళ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. పేద ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ కంటి వైద్యశాల డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఈ శిబిరం నిర్వహించబడటం హర్షణీయమన్నారు. నిపుణులైన వైద్య బృందం గ్రామస్థులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా సలహాలు, సూచనలు, మందులు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మెగా అభిమానులు పాల్గొన్నారు.