ప్రొఫెసర్ పి.వి. నంజరాజ్ అరస్‌కు 'టిప్పు సుల్తాన్ షహీద్ జాతీయ సాహిత్య పురస్కారం

ప్రొఫెసర్ పి.వి. నంజరాజ్ అరస్‌కు 'టిప్పు సుల్తాన్ షహీద్ జాతీయ సాహిత్య పురస్కారం-2026' ప్రదానం

​మైసూరు: ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, శ్రీకృష్ణరాజ ఒడయార్ రాజవంశీకులు ప్రొఫెసర్ పి.వి. నంజరాజ్ అరస్ రచించిన ‘టిప్పు మాన్యత సిగద సుల్తాన్’ (గుర్తింపు దక్కని సుల్తాన్) కన్నడ గ్రంథానికి గాను ప్రతిష్ఠాత్మక 'టిప్పు సుల్తాన్ షహీద్ జాతీయ సాహిత్య పురస్కారం–2026' లభించింది.



​మైసూరులోని ఆయన స్వగృహంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కల్లూరు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని ఘనంగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.ఆర్. హనుమంతు అధ్యక్షత వహించగా, ప్రముఖ కన్నడ కవి, రచయిత ప్రొఫెసర్ వడ్డెగెరె నాగరాజయ్య ముఖ్య సమన్వయకర్తగా వ్యవహరించారు.

​బహుముఖ ప్రజ్ఞకు గుర్తింపు

మైసూరు చరిత్ర, ఒడయార్ వంశ చరిత్ర, టిప్పు సుల్తాన్ కాలం నాటి సామాజిక-రాజకీయ విశేషాలపై లోతైన పరిశోధనలు చేసి చరిత్రను ప్రజలకు చేరువ చేయడంలో ప్రొఫెసర్ నంజరాజ్ అరస్ విశేష పాత్ర పోషించారు. కన్నడ సాహిత్య రంగానికే కాకుండా, చలనచిత్ర రంగంలో నిర్మాతగా, దర్శకుడిగా కూడా ఆయన విశిష్ట సేవలు అందించారు. చారిత్రక వారసత్వ పరిరక్షణ పట్ల ఆయన కనబరిచిన అంకితభావాన్ని, బహుముఖ ప్రజ్ఞను కొనియాడుతూ ఈ పురస్కారాన్ని అందజేశారు. దేశవ్యాప్తంగా మత సామరస్యం, పరమత సహనం, వసుధైక కుటుంబ భావన విస్తరించడంలో ఆయన రచనలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని వక్తలు పేర్కొన్నారు.



​పరస్పర సత్కారం

కల్లూరు ఉమర్ ఫారూఖ్ ఖాన్ త్వరలో వెలువరించనున్న 'శ్రీశారదా మాత శృంగేరీ పీఠ రక్షకుడు షహీద్ టిప్పు సుల్తాన్' గ్రంథానికి సంబంధించిన వివరాలను తెలియజేసి, ప్రొఫెసర్ నంజరాజ్ అరస్ ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రచయిత, సామాజిక సేవకుడు కల్లూరు ఉమర్ ఫారూఖ్ ఖాన్‌ను ప్రొఫెసర్ నంజరాజ్ అరస్ ప్రత్యేకంగా అభినందిస్తూ.. టిప్పు సుల్తాన్ చిహ్నమైన పులి చారల దుశ్శాలువాతో సత్కరించి, తన ‘టిప్పు మాన్యత సిగద సుల్తాన్’ గ్రంథ ప్రతిని బహూకరించారు.