పెద్దకడబూరులో అసంపూర్తి సచివాలయ భవనం, తాగునీటి సమస్యపై మహిళా సభ్యురాలి ఆవేదన



పెద్దకడబూరు, సెప్టెంబర్ 9: పెద్దకడబూరు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఆఖరి మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ సమస్యలపై చర్చ జరగగా, ఓ మహిళా సభ్యురాలు సభలో తన ఆవేదనను వెళ్లగక్కి కన్నీటిపర్యంతమవడం అందరినీ కలచివేసింది.



​అసంపూర్తిగా సచివాలయ భవనం... నానా అవస్థలు

సమావేశంలో ఓ సభ్యురాలు మాట్లాడుతూ... తమ ఎస్సీ కాలనీలో గత ప్రభుత్వ హయాంలో సచివాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభించారని, అయితే ఆ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని తెలిపారు. సొంత సచివాలయం లేకపోవడంతో గ్రామస్తులు వివిధ ధృవీకరణ పత్రాలు మరియు సంక్షేమ పథకాల కోసం నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిలిచిపోయిన సచివాలయ నిర్మాణ పనులను వెంటనే పునఃప్రారంభించి, ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఆమె అధికారులను డిమాండ్ చేశారు.

​వారానికి ఒకసారా? తాగునీటి సమస్యపై కన్నీరు

అనంతరం తాగునీటి సమస్యను ప్రస్తావిస్తూ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కాలనీలో కుళాయిల ద్వారా వారానికి కేవలం ఒక్కసారే తాగునీరు వస్తున్నదని, ఆ నీరు ఏ మూగకూ సరిపోక తాము పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతమని చెబుతూ అధికారుల ముందే కన్నీటిపర్యంతమయ్యారు. "వారానికి ఒక్కసారి నీరు ఇస్తే మేము ఎలా బతకాలి?" అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు కనీసం రెండు లేదా మూడు రోజులకు ఒకసారైనా తాగునీటిని విడుదల చేయాలని ఆమె అధికారులను వేడుకున్నారు.

​ఈ సమస్యలపై స్పందించిన సంబంధిత అధికారులు త్వరలోనే తగు చర్యలు తీసుకుంటామని, ఆగిపోయిన పనులను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.