ఎమ్మిగనూరు, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, కర్నూలు జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లకు వెంటనే సొంత భవనాలు కేటాయించాలని రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఆర్పీఎస్‌ఎఫ్) రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది డిమాండ్ చేశారు.
మంగళవారం ఎమ్మిగనూరులోని స్థానిక కుర్ని ఫంక్షన్ హాల్‌లో ఆర్పీఎస్‌ఎఫ్ జిల్లా మహాసభలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంహెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహమ్మద్, ఎమ్మిగనూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రషీద్, ఏపీయూడబ్ల్యూజె తాలూకా అధ్యక్షులు శ్రీనివాస్ నాయుడు, ఏపీడబ్ల్యూజెఎఫ్ తాలూకా అధ్యక్షులు ఎస్.కె. షబ్బీర్, జాప్ జిల్లా కార్యదర్శి రజాక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహాసభలనుద్దేశించి పలువురు వక్తలు మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతంలో విద్యారంగ సమస్యలు, తాగు, సాగునీటి సమస్యలపై ఆర్పీఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం గత 14 సంవత్సరాలుగా నిరంతరం పోరాటాలు చేస్తుందని కొనియాడారు. రానున్న రోజుల్లోనూ విద్యార్థుల హక్కుల సాధన కోసం మరిన్ని ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జెన్-జీ (Gen-Z) యువత మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థి సంఘాల్లో పనిచేయడం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వామ్యం కావచ్చని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి నూర్ అహ్మద్ మాట్లాడుతూ.. దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు తలుచుకుంటే గుణాత్మక రాజకీయ మార్పు తీసుకురావచ్చని, అది కేవలం జెన్-జీ యువతకే సాధ్యమవుతుందని అన్నారు. ఆర్పీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టే ప్రతీ ప్రజా, విద్యార్థి ఉద్యమానికి తమ వంతు పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ మహాసభలో ఆర్పీఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి దిలీప్, డివిజన్ అధ్యక్షులు మాణిక్య ప్రసాద్, నాయకులు నరసింహ, బాబా, మహబూబ్, షైక్ష, తరుణ్, శంకర్, సాదిక్, రత్నం, అజిజ్ తదితరులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.


