ఆదోని, ఆగస్టు 21: కర్నూలు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పీ) గారి ఆదేశాల మేరకు శుక్రవారం (21-08-2026) ఆదోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాల్మీకి నగర్ ప్రాంతంలో విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఆదోని డీఎస్పీ జి. వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఆదోని వన్‌టౌన్ సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు, ఆదోని టూ టౌన్ సీఐ, త్రీ టౌన్ సీఐ, తాలూకా పోలీస్ స్టేషన్ సీఐతో పాటు మొత్తం 25 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కార్డన్ అండ్ సెర్చ్ సందర్భంగా ప్రాంతంలోని రోడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, అలాగే నాటుసారాయి, మద్యం విక్రయాలకు పాల్పడుతున్న వారి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా శేఖర్ అనే వ్యక్తి ఇంటి నుంచి 10 లీటర్ల నాటుసారాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నాటుసారాయిని ఆదోని వన్‌టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
అదేవిధంగా, ఆ ప్రాంతంలో సుమారు 25 మోటార్ సైకిళ్లను తనిఖీ చేయగా, సరైన పత్రాలు లేని వాహనాలపై మోటారు వాహన చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ కార్యకలాపాల నియంత్రణ, నేరాల నివారణ లక్ష్యంగా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు జిల్లాలో కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.



