ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సుల నిర్వహణను పరిశీలించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

విశాఖపట్నం, ఆగస్టు 22: రాష్ట్ర రవాణా, యువజన సేవలు మరియు క్రీడల శాఖ మంత్రి  మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం విశాఖపట్నం నుంచి ఏఎస్‌ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (భోగాపురం) వరకు నడుస్తున్న ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సుల నిర్వహణను ప్రత్యక్షంగా పరిశీలించారు.



ఈ సందర్భంగా మంత్రి బస్సుల నిర్వహణ, పరిశుభ్రత, ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. బస్సులు నిర్ణీత సమయ పట్టిక ప్రకారం సమయపాలనతో నడుస్తున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం ఈ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ సుమారు 30 శాతం మాత్రమే ఉందని తెలిపారు.



ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ఏరో ఎక్స్‌ప్రెస్ సేవలను మరింతగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర రవాణా మార్గాలతో పోలిస్తే ఈ సేవలు తక్కువ చార్జీలతో అందుబాటులో ఉన్నాయని, కేవలం రూ.50 నుంచి రూ.400 వరకు మాత్రమే చార్జీలు ఉండటంతో ప్రయాణికులు వీటిని వినియోగించుకోవాలని కోరారు.



అనంతరం మంత్రి భోగాపురంలోని ఏఎస్‌ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద కూడా ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సుల నిర్వహణను పరిశీలించారు. విశాఖపట్నం రీజినల్ మేనేజర్  బి. అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఈ బస్సు సేవలు సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు.



ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎటీఎం శ్రీమతి కె. పద్మావతి, డీసీఎంఈ ఎ. గంగాధర్, డిపో మేనేజర్లు ప్రసాద్, శ్రీమతి దుర్గ, సూపర్‌వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.