సిపిఐ పిలుపు మేరకు 18న కలెక్టర్ కార్యాలయం ముట్టడి – రైతులు భారీగా తరలిరావాలని పిలుపు
ఆదోని, ఆగస్టు 17: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 18న కలెక్టర్ కార్యాలయాన్ని వేలాది మంది రైతులతో ముట్టడించనున్నట్లు సిపిఐ నాయకులు ప్రకటించారు.
ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్, మండల కార్యదర్శి కల్లుబావి రాజు, ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు ఓబి నాగరాజు, పట్టణ అధ్యక్షుడు వైసీ భీమేష్, పట్టణ కార్యదర్శి ఎంకన్న, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కొత్తూరు గంగన్న పాల్గొన్నారు.
సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు "మార్పు కావాలి... మార్పు రావాలి..." అనే నినాదంతో ఆగస్టు 6 నుంచి 15 వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో పాదయాత్రలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.
ప్రచారంలో భాగంగా సోమవారం మంత్రికి, పెసరబండ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని నాయకులు విమర్శించారు.
ప్రతి గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు, ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, ప్రస్తుతం ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సిపిఐ నాయకులు అర్జున్, నరసప్ప, గోవిందు, శ్రీరాములు, ఈరన్న, మారెప్ప, హనుమంతు, కొత్తూరు మునిస్వామి, గ్రామ రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.





