ఆదోని, ఆగస్టు 28: మంత్రాలయం బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థినుల భద్రత విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన వార్డెన్‌పై వెంటనే సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు సంజయ్ డిమాండ్ చేశారు.
గురువారం సహాయ బీసీ సంక్షేమ శాఖ అధికారి మాదప్పకు వారు వినతిపత్రం సమర్పించారు. హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థినిని తల్లిదండ్రుల అనుమతి లేకుండానే ఇతర వ్యక్తులతో బయటకు పంపించడం అత్యంత బాధ్యతారాహిత్య చర్య అని వారు పేర్కొన్నారు.
విద్యార్థినుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఉపేక్షించరాదని, ఈ ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా సంబంధిత వార్డెన్‌ను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, హాస్టళ్లలో నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు.


