యూరప్ ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయల మోసం.. కిలాడి లేడీ అరెస్ట్

 విశాఖపట్నం, ఆగస్టు 23: యూరప్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువతను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసిన మహిళను విశాఖ ద్వారక పోలీసులు అరెస్టు చేశారు. "ఫ్లయింగ్ బోర్డర్స్" అనే సంస్థ పేరుతో ఈ మోసాలకు పాల్పడిన సౌజన్య అనే మహిళపై బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



పోలీసుల వివరాల ప్రకారం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని యూరప్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని సౌజన్య నమ్మించింది. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగాలు ఖరారైనట్లు నమ్మించేందుకు తన కార్యాలయంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, అభ్యర్థులకు నకిలీ ఈ-మెయిల్లు పంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, నెలలు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయిన బాధితులు ద్వారక పోలీసులను ఆశ్రయించారు.



బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ పొందారు. అనంతరం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపలోని సౌజన్య నివాసంలో సోదాలు నిర్వహించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విశాఖపట్నానికి తరలించి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ మోసానికి సంబంధించి ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని విశాఖ ద్వారక పోలీసులు విజ్ఞప్తి చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, మోసానికి గురైన వారి సంఖ్య, వసూలు చేసిన మొత్తం తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.