గుంతలమయమైన ప్రధాన రహదారి..

డి. బెడగలులో గుంతలమయమైన ప్రధాన రహదారి.. మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తుల డిమాండ్



కోసిగి, ఆగస్టు 29 (ప్రతినిధి): కోసిగి మండలం డి. బెడగలు గ్రామంలోని ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ముఖ్యంగా రహదారిపై ఉన్న వాటర్ ఓవర్ బ్రిడ్జి వద్ద పెద్ద గుంతలు ఏర్పడినా సంబంధిత ఆర్ అండ్ బీ (R&B) అధికారులు ఇప్పటివరకు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



ఈ రహదారి ఉరుకుంద, మంత్రాలయం, రాయచూర్ ప్రాంతాలకు అనుసంధానమయ్యే ప్రధాన మార్గం కావడంతో ప్రతిరోజూ వందలాది లారీలు, టిప్పర్లు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. గుంతల కారణంగా వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు.



వర్షాల కారణంగా రహదారి మరింత దెబ్బతినడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువయ్యాయని, ఇప్పటికే పలువురు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రజలకు సురక్షిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డి. బెడగలు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.