శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న టీటీడీ అధికారులు

శ్రీ రాఘవేంద్ర స్వామివారికి శ్రీవారి పవిత్ర వస్త్రాల సమర్పణ

మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జ్ రిపోర్టర్: మొహమ్మద్ దానిఫ్



మంత్రాలయం, ఆగస్టు 28: శ్రీ రాఘవేంద్ర స్వామివారి 355వ ఆరాధనా మహోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వాహణాధికారి (ఈవో) శ్రీ ముద్దాడ రవిచంద్ర ఆధ్వర్యంలోని టీటీడీ అధికారుల బృందం శుక్రవారం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించింది.



ఈ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామివారికి సమర్పించేందుకు తిరుమల శ్రీవారి పవిత్ర వస్త్రాలను టీటీడీ అధికారులు తీసుకువచ్చారు. మఠానికి చేరుకున్న టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రతో పాటు అధికారులకు మఠం అధికారులు సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.



అనంతరం టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, పరమపూజ్య 108 శ్రీశ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ వారికి శ్రీవారి పవిత్ర వస్త్రాలను అందజేశారు. అనంతరం స్వామీజీ వారు ఆ పవిత్ర వస్త్రాలను శ్రీ రాఘవేంద్ర స్వామివారికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు. తదనంతరం టీటీడీ అధికారులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ వారికి టీటీడీ ప్రసాదం, శేషవస్త్రాలను సమర్పించారు. స్వామీజీ వారు టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రతో పాటు ఇతర అధికారులకు శేషవస్త్రం, ఫల మంత్రాక్షతలు, జ్ఞాపికను అందించి ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ, మఠం అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామివారి 355వ ఆరాధనా మహోత్సవాల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా సాగింది.