తెలంగాణలో బైక్ ట్యాక్సీల సంక్షోభం: ప్రభుత్వ కొత్త నిబంధనలు, రైడర్ల కష్టాలపై ప్రత్యేక విశ్లేషణ
తెలంగాణలో రవాణా రంగం మరో కీలక మలుపు తిరుగుతోంది. సామాన్య ప్రజలకు, ఉద్యోగులకు తక్కువ ఖర్చుతో గమ్యస్థానాలకు చేరవేస్తున్న బైక్ ట్యాక్సీలపై ప్రభుత్వ కొత్త నిబంధనల ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే పెట్రో ధరల మోత, విపరీతమైన ట్రాఫిక్ చలానాలు, కంపెనీల భారీ కమిషన్లతో సతమతమవుతున్న రైడర్లపై, తాజాగా ప్రభుత్వం తీసుకురానున్న పసుపు రంగు నంబర్ ప్లేట్ (Yellow Number Plate) నిబంధన పిడుగులా పరిణమించింది.
కొత్త నిబంధనల భారం - మాయం కానున్న బైక్ ట్యాక్సీలు: రాష్ట్రంలో ఇకపై ర్యాపిడో, ఉబర్, ఓలా వంటి సేవలు అందించే ప్రతి బైక్ ట్యాక్సీకి ఎల్లో రంగు నంబర్ ప్లేట్ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించనుంది. వైట్ ప్లేట్ (ప్రైవేట్ రిజిస్ట్రేషన్)తో బైక్ ట్యాక్సీ నడిపితే కుదరదని స్పష్టం చేస్తోంది. అయితే, ఈ మార్పు రైడర్ల వెన్నువిరుస్తోంది. బైక్‌ను కమర్షియల్ వెహికల్‌గా మార్చుకోవాలంటే కన్వర్షన్ చార్జీ కింద రూ. 3,000 చెల్లించాలి. దీనికి తోడు కమర్షియల్ రోడ్ ట్యాక్స్, క్వార్టర్లీ ట్యాక్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెన్యూవల్ ఫీజు, గ్రీన్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులు ఇలా అదనపు భారాలు వేలల్లో మోపాల్సి వస్తుంది. రోజువారీ సంపాదనతో కుటుంబాలను నెట్టుకొస్తున్న సామాన్య రైడర్లు ఇంత పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించడం అసాధ్యం. ఈ నిబంధన కనుక అమలైతే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 18 వేలకు పైగా బైక్ ట్యాక్సీలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. బైక్ ట్యాక్సీలు కనుక రోడ్డెక్కకపోతే, ఆటోలు మరియు క్యాబ్ డ్రైవర్లపై రద్దీ విపరీతంగా పెరిగి, సామాన్యులపై ఛార్జీల భారం మరింత మోయరానిదిగా మారనుంది.
రైడర్ల నడ్డివిరుస్తున్న కంపెనీల దోపిడీ: మరోవైపు ప్రభుత్వ నిబంధనల సంగతి ఇలా ఉంటే, అగ్రిగేటర్ కంపెనీల (ర్యాపిడో, ఉబర్, ఓలా) తీరు రైడర్ల పాలిట శాపంగా మారింది. ప్రయాణికుల నుంచి వసూలు చేసే మొత్తంలో కంపెనీలు భారీగా కమిషన్లు కోసేస్తున్నాయి. కష్టపడి నెలంతా రాత్రింబవళ్లు రైడ్లు చేసినా, రైడర్ల చేతికి మిగిలేది శూన్యం. కనీసం బండి మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రావడంలేదని రైడర్లు వాపోతున్నారు. నెలరోజులు కష్టపడితే బండి బాడీ డామేజ్ అవ్వడం మినహా, జేబులో రూపాయి కూడా మిగలకుండా కంపెనీలు తమ రక్తం తాగుతున్నాయని రైడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన చలానాలు - రోడ్ల దుస్థితి: నగరంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నప్పటికీ, ఈ-చలానాల మోత మాత్రం రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. ట్రాఫిక్ నిబంధనల పేరుతో విధిస్తున్న భారీ జరిమానాలు రైడర్లను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్లు సరిగా వేయకుండా, కేవలం చలానాల రూపంలో వేల రూపాయలు వసూలు చేయడంపై తీవ్ర వ్యతిరేక్త వ్యక్తమవుతోంది. అటు ప్రయాణికులకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రావడంతో, ఆటోలు మరియు బైక్ ట్యాక్సీలకు ఆదరణ తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అదనపు నిబంధనలు రైడర్ల ఉపాధిని పూర్తిగా ఛిన్నాభిన్నం చేస్తున్నాయి.
లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న బైక్ ట్యాక్సీ రంగాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. విపరీతమైన పన్నులు, కమర్షియల్ చార్జీల పేరుతో పేద రైడర్ల పొట్ట కొట్టకుండా వెసులుబాట్లు కల్పించాలి. అలాగే కంపెనీలు వసూలు చేసే అసంబద్ధమైన కమిషన్లపై రవాణా శాఖ నియంత్రణ తీసుకురావాలి. అప్పుడే సామాన్యులకు అందుబాటులో ఉండే ఈ ప్రయాణ సౌకర్యం నిలబడుతుంది, లేదంటే వేలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉంది.

