నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలి: సిపిఐ డిమాండ్
- ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట వామపక్షాల ధర్నా, వినతి పత్రం అందజేత
- అల్పాదాయ వర్గాల బతుకులు భారంగా మారాయంటూ ఆవేదన
ఆకాశాన్నంటుతున్న నిత్యవసర వస్తువుల ధరలను తక్షణమే తగ్గించాలని, బ్లాక్ మార్కెట్ మరియు దళారీ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కల్లుబావి రాజు అధ్యక్షత వహించగా, జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్ మాట్లాడుతూ.. నేడు పేదలు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాల బతుకులు తీవ్ర భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రజల ఆదాయాలు ఆశించిన స్థాయిలో పెరగకపోగా, మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న ధరలు కుటుంబ బడ్జెట్లను చిన్నాభిన్నం చేస్తున్నాయని మండిపడ్డారు.
ప్రభుత్వాల వైఫల్యంపై ఆగ్రహం: కృత్రిమ కొరత, అక్రమ నిల్వలు, దళారీ వ్యవస్థ మరియు బ్లాక్ మార్కెట్ కారణంగానే నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని నాయకులు ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను పర్యవేక్షిస్తున్నామని చెబుతున్నప్పటికీ, మార్కెట్లో మాత్రం ఎలాంటి అదుపూ లేకపోవడం గమసార్హం అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులు తగ్గించి రవాణా ఖర్చులను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ప్రధాన డిమాండ్లు: రైతు బజార్లను మరింత బలోపేతం చేసి, విస్తరించాలి.
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిత్యవసర వస్తువులను సరసమైన ధరలకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.
దళారీ వ్యవస్థను అరికట్టి నిత్యావసరాల ధరలపై నియంత్రణ సాధించాలి.
ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు ఓబి నాగరాజు, ఏఐటీయూసీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వైటి భీమేష్, బి. ఎంకన్న, సిపిఐ మండల సహాయ కార్యదర్శి శివరాములు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి సభ్యులు కొత్తూరు గంగన్న, మాజీ సర్పంచ్ హనుమంతు, నాయకులు బైచిగేరి రవి, దొడ్డనగేరి శంకరయ్య, చిన్న పెండేకల్ హనుమంతు, పెసల బండ నరసప్ప, షేక్షావలి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు.

