బాలల దినోత్సవం సందర్భంగా ఘనంగా క్రీడా పోటీలు



విశాఖపట్నం:  బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్, ఆసరా చారిటబుల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో చిన్నారులకు క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. పిఠాపురం కాలనీ, మంగాపురం కాలనీ, శివాజీ పాలెం, పీతలవాని పాలెం ప్రాంతాలకు చెందిన చిన్నారులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కబడ్డీ, ఖో-ఖో, స్టోన్ జంప్, రన్నింగ్ రేస్, మ్యూజికల్ చైర్స్ తదితర అంశాలలో పోటీలు జరిగాయి.



అనంతరం పిఠాపురం కాలనీలోని ఏచూరి భవనంలో బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రోటేరియన్ మోదా అంబిక, డాక్టర్ కె. రమాప్రభ హాజరై విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో చిన్నారులు, పెద్దలతో కూడిన 'చిల్డ్రన్స్ క్లబ్' నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమ నిర్వహణలో కళ్యాణి, మమత, పావని, వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ కన్వీనర్ కె. సుశీల తదితరులు పాల్గొన్నారు.