వాంబే కాలనీలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

పిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: సి. సునీత

రెండు నూతన చిల్డ్రన్స్ క్లబ్‌ల ఏర్పాటు: డాక్టర్ కె. రమాప్రభ



విశాఖపట్నం, (B2B న్యూస్): నగర పరిధిలోని వాంబే కాలనీలో ఆసరా చారిటబుల్ సొసైటీ, వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులకు కబడ్డీ, ఖో-ఖో, రన్నింగ్, డ్రాయింగ్, క్విజ్ వంటి వ్యక్తిగత, సమూహ పోటీలు నిర్వహించి విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.



కార్యక్రమంలో ఆసరా చారిటబుల్ సొసైటీ అధ్యక్షురాలు సి. సునీత మాట్లాడుతూ.. నేటి కాలంలో బాలలు అనూహ్యమైన ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, కొన్ని సందర్భాల్లో చుట్టుపక్కల వారి వల్లే ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలు కూడా కొత్తవారిని నమ్మి ఎక్కడికీ వెళ్లకూడదని, ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయాలని హితవు పలికారు. అనంతరం చాచా నెహ్రూ గొప్పతనాన్ని చాటిచెప్పే గేయాలను పిల్లలతో కలిసి పాడించారు.



వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ వ్యవస్థాపకులు డాక్టర్ కె. రమాప్రభ మాట్లాడుతూ.. తమ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న 'క్రియేటివ్ లెర్నింగ్ సెంటర్స్' ప్రత్యామ్నాయ విద్యా బోధనకు చక్కని వేదికలుగా నిలుస్తున్నాయని తెలిపారు. వాంబే కాలనీ వంటి ప్రాంతాల్లో పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ఇవి ఎంతో అవసరమని, వీటి నిర్వహణలో తల్లిదండ్రులు క్రియాశీలక భాగస్వామ్యం వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వాంబే కాలనీలో రెండు నూతన చిల్డ్రన్స్ క్లబ్‌లను ఏర్పాటు చేసి, వాటి నిర్వహణ కోసం పిల్లలు, పెద్దలతో ప్రత్యేక కమిటీలను నియమించినట్లు వెల్లడించారు.



వేడుకల్లో చిన్నారులు ఆలపించిన దేశభక్తి గేయాలు, పద్యాలు, ప్రదర్శించిన నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మధురవాడ జోన్ విసిసి కన్వీనర్ పి. పుష్ప, కోఆర్డినేటర్ పి. సతీష్, స్థానిక నాయకులు మహేష్, సెంటర్ నిర్వాహకులు కళ్యాణి, తులసి, తల్లిదండ్రుల తరఫున హేమ, భారతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.