మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి నివాసంతో సహా 8 చోట్ల ఏసీబీ ఏకకాలంలో దాడులు
ప్రభుత్వ విలువ ప్రకారం రూ. 6.76 కోట్లు.. బహిరంగ మార్కెట్లో దాదాపు రూ. 100 కోట్ల పైమాటే
బినామీల పేర్లతో ప్లాట్లు, భవనాలు, వైన్ షాపు, షేర్లలో భారీ పెట్టుబడులు
అక్రమాస్తుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు
హైదరాబాద్, (B2B న్యూస్): అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ మార్గంలో కోట్ల రూపాయలు కూడబెట్టిన మరో అవినీతి అధికారిణి బాగోతాన్ని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బట్టబయలు చేశారు. మొయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణి (TPO) గుండు వాణి నివాసంతో పాటు ఆమె బినామీల ఇళ్లపై ఏసీబీ బృందాలు మెరుపు దాడులు నిర్వహించాయి. సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్‌తో సహా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో జరిగిన ఈ సోదాల్లో కళ్లు చెదిరే స్థాయిలో అక్రమాస్తుల పత్రాలు వెలుగుచూశాయి.
లంచం కేసుతో మొదలై.. అక్రమాస్తుల దాకా: గత సెప్టెంబర్ 30న ఓ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు సీనియర్ అసిస్టెంట్ యలమోని సుదర్శన్‌తో కలిసి రూ. 75 వేలు లంచం తీసుకుంటూ గుండు వాణి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఆమె ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు పక్కా సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేపట్టారు.
సోదాల్లో బయటపడిన ఆస్తుల చిట్టా:
భవనాలు, ఫ్లాట్లు: హైదరాబాద్ అత్తాపూర్‌లో రూ. 2.45 కోట్ల విలువైన జీ ప్లస్ టూ (G+2) భవనం, రూ. 63 లక్షల విలువైన మరో ఫ్లాట్ ఉన్నట్లు గుర్తించారు.
ప్లాట్లు, వ్యవసాయ భూమి: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 283.11 చదరపు గజాల రెండు ప్లాట్లు, జనగామ జిల్లా పాలకుర్తిలో 424 చదరపు గజాల ప్లాటు (వీటి విలువ రూ. 87.67 లక్షలు) పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండలో రూ. 29.70 లక్షల విలువైన 1.10 ఎకరాల వ్యవసాయ భూమి డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి.
భారీ పెట్టుబడులు: షేర్ మార్కెట్లో రూ. 1.30 కోట్లు, మహబూబ్‌నగర్‌లోని తుల్జా భవానీ వైన్స్‌లో రూ. 50 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు ఆధారాలు దొరికాయి.
నగదు, బంగారం, వాహనాలు: ఇంట్లో రూ. 5.47 లక్షల నగదు, బ్యాంక్ ఖాతాలో రూ. 7.97 లక్షల బ్యాలెన్స్, 17 తులాల బంగారు ఆభరణాలు, రూ. 5.10 లక్షల విలువైన గృహోపకరణాలను గుర్తించారు. రూ. 98 లక్షల విలువైన రెండు ఖరీదైన కార్లు, రూ. 2 లక్షల విలువైన రెండు బైకులను సీజ్ చేశారు.
రూ. 100 కోట్ల పైనే అసలు విలువ: వాణి నివాసంతో పాటు ఆమె బినామీలుగా వ్యవహరిస్తున్న బంధుమిత్రుల ఇళ్లలో లభించిన ఆస్తుల విలువ ప్రభుత్వ రికార్డుల ప్రకారం రూ. 6.76 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం వీటి విలువ దాదాపు రూ. 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు గుండు వాణిపై అక్రమాస్తుల కేసు నమోదు చేసి, ఆమెను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.



