క్రియేటివ్ లెర్నింగ్ సెంటర్స్ నిర్వాహకులకు ఒక్కరోజు శిక్షణా తరగతులు
ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సి.ఐ. ప్రసాద్
విశాఖపట్నం: పిల్లలు చదువును ఒక భారంగా, భయంగా కాకుండా ఎంతో ఇష్టంగా, సంతోషంగా నేర్చుకునే వినూత్న బోధనా పద్ధతులపై నగరంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఒక్కరోజు శిక్షణా కార్యశాల ఘనంగా జరిగింది. వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ (VCC), ఆసరా చారిటబుల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో క్రియేటివ్ లెర్నింగ్ సెంటర్స్ (CLC) నిర్వాహకులు మరియు చిల్డ్రన్స్ క్లబ్ ఆర్గనైజర్లకు ఈ శిక్షణ నిర్వహించారు.
ఈ కార్యశాలకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం కమిటీ సభ్యులు, నయీ తాలీమ్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ డాక్టర్ సి.ఐ. ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి నిర్వాహకులకు దిశానిర్దేశం చేశారు.
బట్టీ చదువులకు స్వస్తి పలకాలి: ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... ప్రస్తుత విద్యా వ్యవస్థ పిల్లలను కేవలం పుస్తకాల్లోని అంశాలను బట్టీ పట్టే యంత్రాలుగా మారుస్తోందని, ఇది వారిలోని సృజనాత్మకతను, ప్రయోగాత్మక అభ్యసనాన్ని దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా పాఠాలను పాటల రూపంలో, కఠినమైన లెక్కలను కథల రూపంలో బోధిస్తే పిల్లలు ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటారని పేర్కొన్నారు. జిల్లాలోని సీఎల్సీ మరియు చిల్డ్రన్స్ క్లబ్ నిర్వాహకులకు ఇలాంటి సులువైన, వినూత్న బోధనా పద్ధతులపై ప్రత్యేక శిక్షణ అందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ వ్యవస్థాపకులు డా. కె. రమాప్రభ, వీసీసి జిల్లా కన్వీనర్ కే. సుశీల, కోఆర్డినేటర్ పి. సతీష్‌తో పాటు కృష్ణారావు, కొండమ్మ, పుష్ప, అప్పారావు, స్వర్ణలత, నాగరాణి, రజని తదితరులు పాల్గొన్నారు.




