పంచారామ దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..

పంచారామ దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ప్రారంభించిన ఇన్‌ఛార్జ్ ఈడీ బి. అప్పలనాయుడు



  • వచ్చే మూడు ఆదివారాలు కూడా ప్రత్యేక సర్వీసులు

  • శబరిమల యాత్రకు 5, 7 రోజుల స్పెషల్ ప్యాకేజీలు

  • ఆన్‌లైన్, ఏపీఎస్ఆర్టీసీ యాప్ ద్వారా బుకింగ్ సదుపాయం


విశాఖపట్నం: కార్తీకమాసం పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో 'పంచారామ క్షేత్రాల' దర్శనం కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు విజయనగరం జోన్ ఇన్‌ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ), విశాఖపట్నం రీజనల్ మేనేజర్ బి. అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం విశాఖపట్నంలోని ద్వారకా బస్ స్టేషన్ కాంప్లెక్స్‌లో ఈ ప్రత్యేక బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్తీకమాసంలోని వచ్చే మూడు ఆదివారాలు కూడా ఈ పంచారామ ప్రత్యేక యాత్ర బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రయాణికులు తమ టికెట్లను ఆన్‌లైన్ ద్వారా గానీ, 'APSRTC' మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా గానీ సులభంగా బుక్ చేసుకోవచ్చని సూచించారు. యాప్‌లో బస్సుల లైవ్ ట్రాకింగ్ సదుపాయం కూడా ఉందని, ప్రయాణికులు ఈ సాంకేతిక సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.



శబరిమల యాత్రకు ప్రత్యేక ప్యాకేజీలు: అయ్యప్ప భక్తుల కోసం శబరిమల యాత్రకు 5 రోజులు మరియు 7 రోజుల ప్రత్యేక ప్యాకేజీ బస్సులను కూడా నడుపుతున్నట్లు అప్పలనాయుడు వెల్లడించారు. భక్తులు తమ వీలును బట్టి ప్యాకేజీలను ఎంచుకోవచ్చని తెలిపారు. శబరిమల ప్రత్యేక బస్సుల బుకింగ్, ఇతర వివరాల కోసం సంబంధిత డిపో మేనేజర్లను 9959225602, 9959225594 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణాన్ని పొందాలని ఆయన ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.



ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సూపర్‌వైజర్లు, ద్వారకా బస్ స్టేషన్ మేనేజర్ మరియు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు పాల్గొన్నారు.