ఎల్ నినో ప్రభావం:

ఎల్ నినో ప్రభావం: పంటల రక్షణకు రైతులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి - పెద్దకడుబూరు వ్యవసాయాధికారిణి సుచరిత సూచన


పెద్దకడుబూరు, సెప్టెంబర్ 9: ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడటం, అడపాదడపా వర్షాలు కురవడం మరియు దీర్ఘకాలిక బెట్ట పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులు సాగులో ఉన్న పంటల దశలను బట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దకడుబూరు మండల వ్యవసాయాధికారిణి (A.O.) సుచరిత సూచించారు. బుధవారం ఆమె మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి వివిధ పంటలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బెట్ట పరిస్థితులను తట్టుకోవడానికి మరియు చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు పలు కీలక సలహాలు అందజేశారు. 

పత్తి సాగులో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు: ప్రస్తుతం పత్తి పంట పూత నుంచి కాయ దశలో ఉన్నందున, రైతులు క్రింది సూచనలు పాటించాలని ఏఓ సుచరిత తెలిపారు:

బెట్ట నివారణకు పోషక పిచికారీలు: నీటి ఎద్దడిని తట్టుకోవడానికి లీటరు నీటికి 19:19:19 @ 5 గ్రాములు లేదా 13:0:45 @ 5 గ్రాములు చొప్పున, లేదా 2% యూరియా (20 గ్రాములు/లీటరు) పిచికారీ చేయాలి. ఆకులు ఎర్రబడినట్లయితే లీటరు నీటికి మెగ్నీషియం సల్ఫేట్ @ 5 గ్రాములు చొప్పున పిచికారీ చేసి లోపాన్ని సవరించుకోవాలి. బెట్ట కారణంగా పూత, కాయ రాలడాన్ని అరికట్టడానికి లీటరు నీటికి ప్లానోఫిక్స్ @ 0.2 మి.లీ. చొప్పున పిచికారీ చేయాలి. వర్షం రాక పంట గెడసబారి, కీలక దశల్లో ఉన్నప్పుడు లీటరు నీటికి పొటాషియం నైట్రేట్ @ 5 గ్రాములు కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి.

చీడపీడల నివారణ: తామరపురుగు, పచ్చదోమ, తెల్లదోమల ఉధృతిని గమనిస్తూ ఉండాలి. ప్రారంభ దశలో వేపనూనె @ 5 మి.లీ. లేదా అజాడిరాక్టిన్ (10,000 ppm) @ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పచ్చదోమ ఉధృతి ఎక్కువగా ఉంటే ఇమిడాక్లోప్రిడ్ @ 0.3 మి.లీ. లేదా థయామెథాక్సామ్ @ 0.3 గ్రాములు లేదా ఫ్లోనికామిడ్ @ 0.3 గ్రాములు (లీటరు నీటికి) పిచికారీ చేయాలి.తెల్లదోమ కూడా ఆశిస్తే డయాఫెంథియూరాన్ @ 1.25 గ్రాములు (లేదా డయాఫెంథియూరాన్ + ఫ్లోనికామిడ్) లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. గులాబీ రంగు పురుగు నివారణకు ఎకరాకు 10 ఫెరోమోన్ ట్రాప్‌లు ఏర్పాటు చేసి ఉధృతిని పర్యవేక్షించాలి.

తెగుళ్ల నివారణ: ఫ్యూజేరియం విల్ట్ నివారణకు 2 కిలోల ట్రైకోడెర్మా + 2 కిలోల సూడోమోనాస్ లను 20 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి ఎకరాకు వేయాలి. అలాగే కాపర్ ఆక్సీక్లోరైడ్ @ 3 గ్రా./లీటరు నీటికి కలిపి మొక్క మొదలు తడిచేలా పోయాలి. అడపాదడపా కురిసిన వర్షాలకు కాయల్లోకి నీరు చేరి కాయ కుళ్లు తెగులు ఆశించిన ప్రాంతాల్లో కాపర్ ఆక్సీక్లోరైడ్ @ 3 గ్రా. + ప్లాంటోమైసిన్ @ 0.2 గ్రా. (లేదా కాసుగామైసిన్ @ 1.5 గ్రా.) లీటరు నీటికి కలిపి కాయలు తడిసేలా పిచికారీ చేయాలి. రైతులు ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నేల తేమ సంరక్షణ చర్యలు చేపట్టాలని, వ్యవసాయ అధికారుల సలహాలతో సకాలంలో తగిన యాజమాన్యం పాటించి దిగుబడులు కాపాడుకోవాలని ఆమె కోరారు.