- పెద్దకడబూరులో ఘనంగా ‘నిజం గెలిచింది’ కొవ్వొత్తుల ర్యాలీ
- టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ రోజే వైసీపీ పతనానికి తొలి అడుగు: టీడీపీ నేతలు
పెద్దకడబూరు, సెప్టెంబర్ 9: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసిన రోజే నాటి వైసీపీ ప్రభుత్వ పతనానికి తొలి అడుగు పడిందని టీడీపీ మండల అధ్యక్షుడు గవిగట్టు మల్లికార్జున, ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్ ఎన్. రాఘవేంద్రరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం పెద్దకడబూరులో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చంద్రబాబును అక్రమ కేసులతో 53 రోజులు జైలులో ఉంచినా ఆయన ఆత్మవిశ్వాసాన్ని, ప్రజల్లో ఉన్న ఆదరణను దెబ్బతీయలేకపోయారన్నారు. అధికారం శాశ్వతం కాదని, చేసిన అక్రమాలకు ప్రజల తీర్పు ఏవిధంగా ఉంటుందో ఈఘటన నిరూపించిందని విమర్శించారు. ఒక నిజమైన నాయకుడిని కేసులతో అణచివేయవచ్చెమో కానీ, ప్రజల గుండెల్లో ఆయనపై ఉన్న విశ్వాసాన్ని జైలు గోడలతో బంధించలేరని పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు “నిజం గెలిచింది.. చంద్రబాబు గెలిచారు”, “చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి” అంటూ మిన్నంటే నినాదాలు చేశారు.
పాల్గొన్న ప్రముఖులు: ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, ఆర్టీఎస్ తాలూకా కన్వీనర్ దశరథ రాముడు, బూత్ యూనిట్ ఇన్‌చార్జ్ తలారి అంజీ, మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, కోసిగి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కలుగొట్ల లక్ష్మన్న, ఎస్సీ సెల్ జిల్లా కార్యవర్గ సభ్యులు బొగ్గుల నరసన్న, నాయకులు రాఘవరెడ్డి, బాబు, మోజస్, రామ్మూర్తి, చెన్నకేశవ, ఓబులేష్, బీకే వెంకటేష్‌తో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
