‘స్వచ్ఛ బస్ స్టేషన్’ విభాగంలో ప్రథమ బహుమతి
సీఎం చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి ఘన సన్మానం
విశాఖపట్నం: రాష్ట్రస్థాయిలో విశాఖపట్నం ద్వారకా బస్ స్టేషన్ (ఆర్టీసీ కాంప్లెక్స్) అరుదైన ఘనత సాధించింది. 'స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్' కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో 'స్వచ్ఛ బస్ స్టేషన్' విభాగంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీవో) బి. అప్పలనాయుడు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు.
సమష్టి కృషితోనే సాధ్యం: డీపీటీవో బి. అప్పలనాయుడు
ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ద్వారకా బస్ స్టేషన్ ప్రాంగణంలో ప్రత్యేక అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అవార్డు సాధనలో కీలకపాత్ర పోషించిన పారిశుద్ధ్య కార్మికులు, పర్యవేక్షకులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బందిని అధికారుల బృందం ఘనంగా సన్మానించి, స్వీట్లు పంపిణీ చేసింది.
అనంతరం డీపీటీవో బి. అప్పలనాయుడు మాట్లాడుతూ.. ఈ పురస్కారం ఏ ఒక్కరి వల్లనో రాలేదని, క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమించిన పారిశుద్ధ్య కార్మికుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరి సమష్టి కృషికి దక్కిన ఫలితమని కొనియాడారు. ఈ అవార్డు తమ బాధ్యతను మరింత పెంచిందని, వచ్చే ఏడాది కూడా ఈ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రతను ఒక ప్రజా ఉద్యమంగా మలచి, ప్రభుత్వ ఆశయమైన ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్రప్రదేశ్’ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీటీఎం కె. పద్మావతి, ఏటీఎం కె. గంగాధర్, అకౌంట్స్ ఆఫీసర్ కుమారి వంశీ మోహిని, పర్సనల్ ఆఫీసర్ జె. తిరుపతి, ఏటీఎం (కమర్షియల్) జి.జి.వి. రమణలతో పాటు జిల్లాలోని వివిధ డిపోల మేనేజర్లు, ఆర్టీసీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


