విశాఖ డీఎంహెచ్ఓ కార్యాలయంలో అక్రమ డెప్యుటేషన్ల పర్వం!
నిబంధనలకు విరుద్ధంగా ఏళ్ల తరబడి ఒకే చోట తిష్ట
ఉన్నతాధికారి అండదండలతోనే కొనసాగింపు?
అనకాపల్లి నుంచి వైజాగ్‌కు ఎక్స్టెన్షన్ ఆర్డర్ల మాయాజాలం
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (డీఎంహెచ్ఓ) కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డెప్యుటేషన్ల వ్యవహారం జోరుగా సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనకాపల్లి పరిధిలో విధులు నిర్వర్తించాల్సిన ఓ హెల్త్ ఎడ్యుకేటర్ గత 2012 నుంచి దాదాపు 12 ఏళ్లుగా వైజాగ్‌లోనే అక్రమంగా డెప్యుటేషన్‌పై కొనసాగుతుండటం శాఖాపరంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ప్రెసిడెన్షియల్ ఆర్డర్లకు తూట్లు: ప్రభుత్వ నిబంధనలు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ల ప్రకారం ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా ఉన్నత స్థాయి అధికారుల ఆమోదం లేకుండా సాధారణంగా డెప్యుటేషన్ పొడిగింపులు ఇవ్వడం సాధ్యం కాదు. అయితే, ఉన్నతాధికారుల పేరిట నకిలీ లేదా అనుమానాస్పద ఉత్తర్వులు సృష్టించి, ప్రొసీడింగ్స్ అంటూ కార్యాలయంలో కొనసాగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎంహెచ్ఓ కార్యాలయంలోని మీడియా విభాగం, ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ల వ్యవహారాల్లో చక్రం తిప్పేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని, దీనికి జిల్లా ఉన్నతాధికారి పూర్తి సహకారం అందిస్తున్నారని విశ్వసనీయ సమాచారం.
అధికారి అండదండలతోనే హవా: కార్యాలయంలో అవసరానికి మించి సిబ్బంది ఉన్నప్పటికీ, డెప్యుటేషన్ ఆర్డర్ల పేరుతో ఆమెను డీఎంహెచ్ఓ కార్యాలయంలోనే ఉంచేందుకు జిల్లా ఉన్నతాధికారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఉద్యోగ వర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు, అనుమతుల ప్రక్రియలో అందినకాడికి దండుకునేందుకు, ప్రతి అధికారిక కార్యక్రమంలో ఆమెను ముందుంచేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల డెప్యుటేషన్ల వివాదంపై అసంతృప్తి పెరగడంతో, ఉన్నతాధికారుల వద్ద నుంచి తెచ్చుకున్నట్లుగా చూపుతున్న 'ఎక్స్టెన్షన్ ఆర్డర్' అసలు నిజమైనదేనా లేక అధికారుల కళ్లబొల్లి వ్యవహారమా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి: వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటనల నేపథ్యంలో ఈ అక్రమ డెప్యుటేషన్ ఆర్డర్ల వ్యవహారంపై శాఖాపరమైన విచారణ జరిపించాలని, 2012 నుంచి రికార్డులను పరిశీలిస్తే అధికారుల అక్రమాలు, నిధుల గోల్మాల్ బయటపడతాయని కార్యాలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ డెప్యుటేషన్లను రద్దు చేసి, నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.

