సేవ చేయడానికే పోటీలో నిలిచా: స్వతంత్ర అభ్యర్థి శెట్టి నాగేష్

అగ్రహారంలో ఇంటింటి ప్రచారం

‘ఎయిర్ కండిషనర్’ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి

భారీగా తరలివచ్చిన RV నగర్ యువత



జీకే వీధి: రాజకీయాలకు అతీతంగా ప్రజలకు నిస్వార్థ సేవ చేయాలనే లక్ష్యంతోనే స్థానిక ఎన్నికల బరిలో నిలిచానని జీకే వీధి-3 ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థి శెట్టి నాగేష్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని మారుమూల గ్రామమైన అగ్రహారంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.



అభిమానులు, యువతతో కలిసి గ్రామానికి చేరుకున్న ఆయన ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలిశారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా నాగేష్ మాట్లాడుతూ.. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, నియోజకవర్గ సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే గ్రామంలోని మౌలిక వసతుల కల్పన, సమస్యల శాశ్వత పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

ఈ ప్రచారంలో ఆర్యనగర్‌కు చెందిన యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నాగేష్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘అన్నా మేమున్నాం’ అంటూ నినాదాలు చేస్తూ ప్రచారంలో జోష్ నింపారు. జీకే వీధి-3 ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు కేటాయించిన ‘ఎయిర్ కండిషనర్’ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను అభ్యర్థించారు.